-
పార్లమెంట్ ముంగిటకు డీ లిమిటేషన్ బిల్లు
-
విపక్షాలను ఒప్పించే బాధ్యత ఏపీ సీఎంకు
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. బుధవారం హస్తినబాట పట్టనున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో.. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లును మరోసారి తీసుకురా నందన ప్రచారం నడుస్తోంది.
ఇటువంటి సమయంలో సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన జరుపుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలో సీఎం చంద్రబాబు కొంతమందితో కీలక చర్చలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇవే రెండు ప్రతిష్టాత్మక బిల్లులు పార్లమెంటులో తిరస్కరణకు గురయ్యాయి. ఇప్పుడు మరోసారి ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అనే వార్తలు వస్తున్నాయి.
-
కీలక భాగస్వామిగా..
కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. గత కొంతకాలంగా డీలిమిటేషన్ బిల్లుపై చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుందన్న వాదనను తోసిపుచ్చారు చంద్రబాబు. అన్ని రాష్ట్రాలతో సమానంగానే దక్షిణాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని.. ఈ విషయంలో ఎటువంటి ఆందోళన వద్దు అని చంద్రబాబు మిగతా రాజకీయ పక్షాలను కోరారు కూడా.
-
మిగతా పార్టీలతో దౌత్యం..
అయితే డి లిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ వెళ్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్లమెంటులో బిల్లు ఆమోదానికి అవసరమైన మూడంతుల మెజారిటీ కోసం వివిధ ప్రాంతీయ, విపక్షం పార్టీలను ఏకీకృతం చేయడంలో చంద్రబాబు దౌత్యం నడుపుతున్నారని వార్తలు బలంగా వినిపించాయి.
దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా.. 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలయ్యేలా జాతీయస్థాయిలో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందేందుకు.. ఆయన పలువురు పార్టీ నేతలతో అంతర్గత చర్చలు జరుపుతున్నారు.
-
కేంద్ర మంత్రులతో భేటీ..
అయితే ఢిల్లీ పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు విడుదలపై ప్రధాని నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా లతో పాటు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి అయితే ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన దేశ పొలిటికల్ సర్కిల్స్ లోనే పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది.