ఆంధ్రప్రదేశ్ చేనేత రంగం మరోసారి జాతీయ స్థాయిలో కీర్తి పతాకం ఎగురవేసింది. రాష్ట్రానికి చెందిన ఇద్దరు ప్రతిభావంతులైన చేనేత కళాకారులు 2025 సంవత్సరానికి గాను ప్రకటించిన జాతీయ చేనేత పురస్కారాలకు ఎంపికయ్యారు. తమ కృషి, నైపుణ్యంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ నేతన్నలు రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు.
తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన నక్కా వెంకటేశ్వరరావు ‘ఉత్తమ మార్కెటింగ్’ విభాగంలో అవార్డు అందుకోనున్నారు. వెంకటగిరి చీరలకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. దాదాపు ఆరు దశాబ్దాలుగా కుటుంబ సంప్రదాయంగా చేనేత వృత్తిని కొనసాగిస్తూ, ఈ సంప్రదాయ కళను అంతర్జాతీయ స్థాయికి చేర్చడంలో ఆయన కృషి విశేషం.
ఇక శ్రీకాకుళం జిల్లా ఆలికాం గ్రామానికి చెందిన మురకల నటరాజ్ కూడా ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. గత 15 సంవత్సరాలుగా చేనేత రంగంలో కొనసాగుతున్న ఆయన, పొందూరు కాటన్‌తో జమ్దానీ చీరలను అద్భుతంగా నేసడంలో నైపుణ్యం సంపాదించారు. తన పనితీరుతో ప్రత్యేక గుర్తింపు పొందడమే కాకుండా, సుమారు 50 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ చేనేత రంగ అభివృద్ధికి తోడ్పడుతున్నారు.
ఈ ఇద్దరు కళాకారులు 2026 ఆగస్టు 7న నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో అవార్డులను అందుకోనున్నారు. ఈ విజయంతో ఆంధ్రప్రదేశ్ చేనేత రంగానికి మరింత ప్రాధాన్యం, గుర్తింపు లభించనుంది.
also read: జగిత్యాలలో సంచలనం: ఆర్టీసీ బస్సు అపహరణ – పోలీసుల సినిమా స్టైల్ చేజ్!