Homeతెలంగాణఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చుట్టూ ఉచ్చు!

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చుట్టూ ఉచ్చు!

•గురుకులాల కార్యదర్శి హోదాలో పదివేల కోట్ల అవినీతి
•సీఎం రేవంత్ కు మాజీ ఎమ్మెల్యే గువ్వల లేఖ
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :- 

తెలంగాణ రాజకీయాల్లో లేఖల కలకలం రేగింది. మాజీ ఐపీఎస్ అధికారి, గులాబీ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఐపీఎస్ అధికారిగా ప్రవీణ్ కుమార్ ఉండేటప్పుడు, కెసిఆర్ ప్రభుత్వంలో గురుకులాల పేరుతో పదివేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ ఆరోపించారు గులాబీ పార్టీ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకుల విద్యాలయాల కార్యదర్శిగా పనిచేసిన.. 2013 నుంచి 2021 మధ్య కాలంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని.. సుమారు పదివేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిందని గువ్వల బాలరాజు తన లేఖలో సంచలన ఆరోపణలు చేశారు. టెండర్ ప్రక్రియలను పక్కనపెట్టి నిధులు ఖర్చు చేశారని.. ఉద్యోగ నియామకాలు, క్రమబద్ధీకరణతోపాటు ఐఐటి, జేఈఈ కోచింగ్ ల పేరుతో భారీగా నిధులు పక్కదారి పట్టించారని పేర్కొంటూ ఈ లేఖలో ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.

సుదీర్ఘకాలం పార్టీలో…
గులాబీ పార్టీలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు గువ్వల బాలరాజు. 2009లో తొలిసారిగా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2014, 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం భారతీయ జనతా పార్టీలో చేరారు. అటువంటి నాయకుడు ఏకంగా బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు అధినేత కెసిఆర్ ను సైతం టార్గెట్ చేయడం విశేషం. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతుతోనే ఈ అక్రమాలు జరిగాయని బాలరాజు ఆరోపిస్తున్నారు. సాధారణంగా ఐఏఎస్ క్యాడర్ అధికారులు నిర్వహించాల్సిన గురుకులాల సెక్రటరీ బాధ్యతలను.. ఐపీఎస్ అధికారి అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు దాదాపు 10 ఏళ్ల పాటు అప్పగించడం వెనుక ఉన్న మతల బు పై విచారణ జరపాలని కూడా ఆయన డిమాండ్ చేయడం విశేషం. అక్రమాలు రుజువైతే సంబంధిత ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

ఆ ముగ్గురి కుట్ర,: ప్రవీణ్ కుమార్..
మరోవైపు తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఘాటుగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. గువ్వల బాలరాజు లేక లోని అంశాలను లొసుగులతో కూడిన అబద్ధాలుగా కొట్టి పారేశారు. రాష్ట్రంలో 82 వేల కోట్లతో కట్టిన కాలేశ్వరం ప్రాజెక్టులో.. లక్ష కోట్ల అవినీతి జరిగిందనే ప్రచారం ఎంత పెద్ద అబద్ధమో.. అసలు కేవలం ఎనిమిది వందల కోట్ల వార్షిక బడ్జెట్ మాత్రమే ఉన్న గురుకులాల్లో ఏకంగా పదివేల కోట్ల అవినీతి జరిగిందని కూడా అంతే పెద్ద అబద్ధం అంటూ కొట్టి పారేశారు. బడ్జెట్ పరిమితులను దాటి వేలకోట్ల రూపాయలు దోచేశారనడం హాస్యాస్పదం అని మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. గతంలో ఇదే గువ్వల బాలరాజు తన పనితీరును ఎంతో పొగిడారని.. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ తో చేతులు కలిపి తనపై కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. తన తప్పు ఉంటే అరెస్టు చేసుకోవచ్చు అని తేల్చి చెప్పారు. అయితే మున్ముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చుట్టూ వుచ్చు మరింత బిగిసుకునే అవకాశం ఉంది.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు