జార్ఖండ్ రాజధాని రాంచీలో విషాద ఘటన చోటుచేసుకుంది. దైవసేవలో నిమగ్నమైన ఓ ఆలయ ప్రధాన అర్చకుడు భక్తుల సమక్షంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. రాంచీలోని రాతు రోడ్ ప్రాంతంలోని ఇంద్రపురి ఆలయంలో సోమవారం సాయంత్రం పూజా కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య రజనీకాంత్ మిశ్రా స్వామివారికి హారతి ఇస్తుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురై పూజా పీఠం వద్దే కుప్పకూలిపోయారు.
అక్కడే ఉన్న భక్తులు, బీజేపీ నాయకుడు రమేష్ సింగ్ వెంటనే స్పందించి అర్చకుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన కార్డియాక్ అరెస్ట్‌కు గురై మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎంతో భక్తిశ్రద్ధలతో నిత్యం దేవుడి సేవలో ఉండే అర్చకుడు.. అదే సేవ చేస్తూ కన్నుమూయడం భక్తులను తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది. ఆలయ ప్రాంగణంలో విషాద వాతావరణం నెలకొంది.
also read: స్నాక్స్ కోసం బైక్ ఇవ్వలేదని దారుణం.. మద్యం మత్తులో వ్యక్తిని బీర్ సీసాలతో కొట్టి హత్య