నగరంలో మరోసారి ప్రేమ వ్యవహారం విషాదాంతానికి దారి తీసింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడిని దుండగులు దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం… వరంగల్ జిల్లా మాదన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన చిన్నపల్లి భాస్కర్ అనే వ్యక్తి, తన గ్రామానికి చెందిన నిఖిత అనే యువతిని ప్రేమించాడు. అయితే ఈ సంబంధాన్ని యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో ఆమెకు మూడేళ్ల క్రితం మరో వ్యక్తితో వివాహం జరిపించారు.
వివాహం తర్వాత కూడా దాంపత్య జీవితంలో విభేదాలు తలెత్తడంతో, ఇటీవలే ఆమెకు భర్త విడాకులు ఇచ్చినట్లు సమాచారం. ఈ పరిణామాల మధ్య భాస్కర్‌తో ఆమెకు మళ్లీ సంబంధాలు పెరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే యువతి కుటుంబ సభ్యులే భాస్కర్‌పై దాడి చేసి హత్య చేసినట్లు మృతుడి సోదరుడు మధు ఆరోపించాడు. కత్తులతో దాడి చేయడంతో భాస్కర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి, అసలు కారణాలు, నిందితుల వివరాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read: ముంబై ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్… విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన