శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బొడ్డేపల్లి గ్రామానికి చెందిన షర్మిల (26)కు ఏడాది క్రితం నాగరాజుతో వివాహం జరిగింది. వివాహం తర్వాత భర్త, అత్తమామలు, మరిదితో కలిసి ఆదివారంపేటలోని ఒకే ఇంట్లో ఆమె నివసిస్తోంది.
ఈ నెల 8న భర్త విధులు ముగించుకుని ఇంటికి రాగా.. షర్మిల భోజనం సిద్ధం చేసి, ఆయనకు ఆమ్లెట్ కూడా పెట్టింది. అదే సమయంలో పక్కనే భోజనం చేస్తున్న చిన్న కొడుక్కి ఆమ్లెట్ ఇవ్వలేదనే విషయంపై అత్త దమయంతి ఆమెతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఈ గొడవ సమయంలో భర్త ఎలాంటి స్పందన ఇవ్వకపోవడంతో షర్మిల తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలు, వేధింపుల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికానున్నాయి.
also read: పెళ్లి చేసుకోమన్నందుకు షాకింగ్ రియాక్షన్.. గుండు చేయించుకున్న ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్!