క్రైమ్ మిర్రర్ : సిరిసిల్ల పట్టణంలో ఇటీవల సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆస్తిని దక్కించుకోవాలనే ఉద్దేశంతో మేనమామను హత్య చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సిరిసిల్ల టౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. నిందితుడి నుంచి హత్యకు ఉపయోగించిన బండరాయి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల బీవై నగర్‌కు చెందిన పుప్పాల శ్రీకాంత్ ప్రస్తుతం వేములవాడ న్యూ అర్బన్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న శ్రీకాంత్ కొంతకాలంగా మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉండేవాడని పోలీసులు తెలిపారు. దీంతో భార్య తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆరు సంవత్సరాల క్రితమే అతడికి దూరంగా వెళ్లిపోయినట్లు వెల్లడించారు.
ఆ తర్వాత తల్లితో కలిసి ఉంటూ మద్యం కోసం తరచూ డబ్బులు అడిగి ఇబ్బంది పెట్టేవాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఐదు నెలల క్రితం తన మేనమామ రాగుల ఎల్లయ్య ఇంటికి వెళ్లి డబ్బుల కోసం గొడవకు దిగాడు. దీంతో ఎల్లయ్య అందరి ముందు శ్రీకాంత్‌ను మందలించి కొట్టడంతో అవమానంగా భావించి అతడిపై కక్ష పెంచుకున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు.
అదే సమయంలో ఎల్లయ్యకు భార్య, పిల్లలు లేకపోవడంతో ఆయన ఇంటిని తాను సొంతం చేసుకోవచ్చనే ఆలోచనతో శ్రీకాంత్ హత్యకు పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు. నాలుగు నెలల క్రితం తన తల్లి కూడా మృతి చెందడంతో ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో ఎలాగైనా మేనమామను తొలగించి ఆస్తిని పొందాలని నిర్ణయించుకున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు.
ఈ నెల 4న సిరిసిల్ల మార్కెట్‌లో ఎల్లయ్యను కలిసిన శ్రీకాంత్.. పెద్దూరు శివారు ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ మద్యం సేవించిన అనంతరం మత్తులో ఉన్న ఎల్లయ్యపై దాడి చేశాడు. తొలుత గొంతు నులిమి హత్య చేసేందుకు ప్రయత్నించగా, ఎల్లయ్య ప్రతిఘటించడంతో సమీపంలో ఉన్న బండరాయితో తలపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
అనంతరం మృతదేహాన్ని పాత బట్టలతో కప్పి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు వెల్లడించారు. మరుసటి రోజు ఎల్లయ్య కనిపించకపోవడంతో ఆయన బంధువు రాగుల శారద సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు శ్రీకాంత్‌పై అనుమానంతో విచారణ చేపట్టారు. హైదరాబాద్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో సిరిసిల్ల ఎల్లమ్మ చౌక్ వద్ద అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.
నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
also read :ప్రముఖ గాయని ఎస్. జానకి కన్నుమూత.. సంగీత ప్రపంచంలో విషాదం