కేరళ రాష్ట్రంలోని కన్నూర్ జిల్లాలో చోటుచేసుకున్న విషాద ఘటన కలకలం రేపుతోంది. చిన్న గాయానికి చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లిన 18 నెలల బాలుడు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. చికిత్స సమయంలో ఇచ్చిన మత్తుమందు (అనస్థీషియా) కారణంగానే తమ కుమారుడు మృతి చెందాడని బాధిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే… కన్నూర్ జిల్లా ఎరమం-కుట్టూర్ ప్రాంతానికి చెందిన దంపతుల కుమారుడు జులై 5న ఇంటి వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ఈ ఘటనలో బాలుడి పెదవికి గాయం కావడంతో రక్తస్రావం జరిగింది. వెంటనే తల్లిదండ్రులు సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు.
తర్వాత మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా, గాయానికి కుట్లు వేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో చిన్నారికి మత్తుమందు ఇచ్చి చికిత్స ప్రారంభించారు. అయితే చికిత్స అనంతరం బాలుడు అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆందోళన చెందిన వైద్యులు వెంటనే అతడిని మరింత మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్‌పై ఉంచారు. అయినప్పటికీ పరిస్థితి విషమించడంతో బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఇదిలా ఉండగా, వైద్యురాలి నిర్లక్ష్యమే తమ కుమారుడి మృతికి కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఆస్పత్రి యాజమాన్యం మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. అనస్థీషియా ఇచ్చిన తర్వాత అరుదుగా ఇలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని, అన్ని వైద్య ప్రమాణాలు పాటించినప్పటికీ చిన్నారిని రక్షించలేకపోయామని తెలిపింది. బాలుడి ప్రాణాలను కాపాడేందుకు వైద్య బృందం అన్ని విధాలా ప్రయత్నించిందని వెల్లడించింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దర్యాప్తు నివేదిక వెలువడిన తర్వాతే అసలు కారణం బయటపడే అవకాశం ఉంది.
also read: కన్నతల్లిని కత్తితో పొడిచి చంపిన కసాయి… అడ్డం వచ్చారని మేనమామ, నాయనమ్మలను సైతం….