ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులను నమ్మించి లక్షల రూపాయలు దోచుకున్న భారీ మోసం ఢిల్లీలో వెలుగుచూసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ మోసం బయట ఎక్కడో కాదు, ఏకంగా ఇన్కమ్ టాక్స్ కార్యాలయాన్నే వేదికగా చేసుకుని సాగింది. దీంతో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువత ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
కొందరు కేటుగాళ్లు సోషల్ మీడియాలో ఇన్కమ్ టాక్స్ శాఖలో ఉద్యోగాల పేరుతో నకిలీ ప్రకటనలు పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందనే ఆశతో పలువురు యువత ఆ ప్రకటనలను నమ్మి వారిని సంప్రదించారు. ఆ తర్వాత అభ్యర్థులను ఢిల్లీలోని సివిక్ సెంటర్లో ఉన్న ఇన్కమ్ టాక్స్ కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడే ఇంటర్వ్యూలు, ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించారు. దీంతో నిజంగానే ప్రభుత్వ నియామక ప్రక్రియ జరుగుతోందని బాధితులు భావించారు.
ఈ మోసంలో అత్యంత కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఇన్కమ్ టాక్స్ శాఖలో గతంలో పనిచేసిన మాజీ ఉద్యోగి చిరాగ్ అగర్వాల్ అని పోలీసులు గుర్తించారు. శాఖలో పనిచేసిన అనుభవాన్ని ఉపయోగించుకుని అభ్యర్థులను కార్యాలయం లోపలికి తీసుకెళ్లి, నకిలీ వెరిఫికేషన్ ఫారాలు, సర్వీస్ బుక్లు చూపిస్తూ పూర్తిగా నమ్మించాడు. ఉద్యోగం ఖాయం అవుతుందని చెప్పి ఒక్కో అభ్యర్థి నుంచి రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. ఇలా పలువురి నుంచి భారీ మొత్తంలో డబ్బు సేకరించినట్లు పోలీసులు తెలిపారు.
అజ్మేరి గేట్ ప్రాంతానికి చెందిన ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ భారీ జాబ్ స్కాం వెలుగులోకి వచ్చింది. టెక్నికల్ సర్వైలెన్స్ సహాయంతో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నాలుగు మొబైల్ ఫోన్లతో పాటు బాధితులకు సంబంధించిన నకిలీ పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ మోసానికి అసలు సూత్రధారి ఇంకా పరారీలోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను నమ్మే ముందు అధికారిక వెబ్సైట్లు, నోటిఫికేషన్లను తప్పనిసరిగా పరిశీలించాలని పోలీసులు నిరుద్యోగులకు సూచిస్తున్నారు.