ఇన్స్టాగ్రామ్లో చిన్నారులపై లైంగిక వేధింపులను ప్రేరేపించేలా ఉన్న కంటెంట్, ప్రకటనల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి కఠినంగా స్పందించింది. ఈ అంశంపై మెటా సంస్థకు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి అభ్యంతరకరమైన ప్రకటనలు, కంటెంట్ ను వెంటనే తొలగించాలని మెటాను ఆదేశించింది. అలాగే ఇలాంటి యాడ్స్ ఇన్స్టాగ్రామ్లో ఎలా కనిపించాయో, వాటిని మోడరేషన్ వ్యవస్థ ఎందుకు గుర్తించలేకపోయిందో వివరించాలని కోరింది. ఈ విషయంపై పూర్తి నివేదికను 7 రోజుల్లోగా సమర్పించాలని కేంద్రం స్పష్టం చేసింది.
ఈ చర్యలకు కారణం బీబీసీ ప్రచురించిన ఓ పరిశోధనాత్మక కథనం. ఆ కథనం ప్రకారం, భారత్లోని కొన్ని ఇన్స్టాగ్రామ్ అకౌంట్లలో చిన్నారులపై లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా ఉన్న ప్రకటనలు కనిపించాయి. ఆ ప్రకటనల్లో కొన్ని టెలిగ్రామ్ ఛానళ్లకు లింకులు ఇచ్చి, కేవలం రూ.99కే అలాంటి కంటెంట్ అందుబాటులో ఉంటుందని ప్రచారం చేసినట్లు వెల్లడించింది. ఈ కథనం వెలుగులోకి రావడంతో కేంద్ర ఐటీ శాఖ మంత్రి స్పందించారు. మెటా అధికారులను వెంటనే పిలిపించి వివరణ తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఐటీ మంత్రిత్వ శాఖ అధికారికంగా మెటాకు నోటీసులు జారీ చేసింది.
ఇలాంటి సున్నితమైన కంటెంట్ సోషల్ మీడియా వేదికపై ఎలా అనుమతించబడిందనే అంశంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోనున్న చర్యలు, భద్రతా వ్యవస్థల్లో చేయనున్న మార్పులపై కూడా వివరాలు ఇవ్వాలని మెటాను కేంద్రం కోరింది. చిన్నారుల భద్రతకు సంబంధించి ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో మెటా ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.