•ఉనికి చాటుకునేందుకు గులాబీ పార్టీ ఆరాటం
•బిఆర్ఎస్ అవినీతిని కాంగ్రెస్ ఎండగట్టే ప్రయత్నం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:-
తెలంగాణలో కాలేశ్వరం మోటార్ల చుట్టూ రాజకీయం మొదలైంది. సరికొత్త హైడ్రామా ప్రారంభం అయింది. వర్షాకాలం ప్రారంభమై గోదావరి నదిలోకి వరద నీరు వచ్చి చేరుతున్న తరుణంలో.. కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చుట్టూ మళ్ళీ రాజకీయం వేడెక్కింది. కాలేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నేపల్లి పంప్ హౌస్ లోని మోటార్లను తక్షణమే ఆన్ చేసి.. ఎగువన ఉన్న రిజర్వాయర్లకు నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన బృందంతో దండయాత్ర మొదలుపెట్టారు. మేడిగడ్డ పర్యటనకు సిద్ధమయ్యారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతాంగానికి నిరంధించడమే లక్ష్యంగా భారత్ రాష్ట్ర సమితి ఈ టూర్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది
కేటీఆర్ బృందం రెడీ..
గోదావరి నదిలోకి భారీగా ఇన్‌ఫ్లో వస్తున్నప్పటికీ.. కెసిఆర్ పై ఉన్న రాజకీయ కక్షతోనే కాలేశ్వరం మోటార్లను ఆన్ చేయడం లేదని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. కన్నేపల్లి పంప్ హౌస్ లోని మోటార్లు సురక్షితంగానే ఉన్నాయని.. వాటిని ఆన్ చేసి నీటిని పంపిస్తే ఎండిపోతున్న ఆయకట్టుకు ప్రాణం పోయేవచ్చని బీఆర్ఎస్ వాదిస్తోంది. కెసిఆర్ నిర్మించిన ఈ అద్భుత ప్రాజెక్టును పనికిరానిదిగా చిత్రీకరించేందుకు రేవంత్ సర్కార్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని.. దీనిని ఎండగట్టడానికి తాము క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తున్నట్లు కేటీఆర్ వర్గం చెబుతోంది.
తిప్పి కొడుతున్న రేవంత్ సర్కార్..
రేవంత్ సర్కార్ ఈ ఆరోపణలను గట్టిగానే తిప్పికొడుతోంది. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పిల్లర్ల వల్ల ప్రస్తుతం అక్కడ నీటి నిల్వ ఉంచడం ప్రమాదకరమని.. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిబంధనల ప్రకారం జూన్ 2027 నాటికి మాత్రమే పునరుద్ధరణ పనులు పూర్తవుతాయని స్పష్టం చేస్తోంది. కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా బాధ్యతారహితమని… కనీస స్పృహ లేకుండా ఉన్నాయని కొట్టిపారేస్తున్నారు. గత ప్రభుత్వ తప్పుడు డిజైన్ల వల్లే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయని చెబుతున్నారు. ప్రస్తుతం సెంట్రల్ వాటర్ కమిషన్, ఎన్ డి ఎస్ ఏ నిపుణుల ఆధ్వర్యంలో 13 రకాల కీలక సేఫ్టీ టెస్టులు నడుస్తున్నాయి. ఇలాంటి సాంకేతిక పరీక్షల సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా మోటార్లు ఆన్ చేసి నిల్వ చేస్తే.. దాదాపు 50 గ్రామాల వరకు ముంపునకు గురవుతాయని.. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి రాజకీయం చేయాలని చూస్తే సహించేది లేదు అని కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరిస్తోంది. అయితే కాలేశ్వరం ప్రాజెక్టు మళ్ళీ ఆ ఉభయ పార్టీల మధ్య పొలిటికల్ వార్ గా మారుతుంది. భారత్ రాష్ట్ర సమితి తన ఉనికి చాటుకోవడానికి… కెసిఆర్ మార్పు ప్రాజెక్టును డిపెండ్ చేసుకోవడానికి చలో మేడిగడ్డ అస్త్రాన్ని ప్రయోగించింది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సాంకేతిక భద్రత నివేదికలు ముందుకు తెచ్చి గులాబీ పార్టీ హయాంలో అవినీతిని ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది.