Homeతెలంగాణకవితకు టిఆర్ఎస్ లేనట్టే.! ఎన్నికల సంఘం తిరకాసు..

కవితకు టిఆర్ఎస్ లేనట్టే.! ఎన్నికల సంఘం తిరకాసు..

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రక్షణ సేన పేరుతో రాజకీయాలు చేయాలనుకున్న కల్వకుంట్ల కవితకు షాక్ తప్పేలా లేదు. ఎన్నికల్లో సంఘం షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. పూర్వపు టిఆర్ఎస్ పేరుతో రాజకీయ పార్టీ వచ్చేలా ప్రణాళిక రూపొందించుకున్నారు కవిత. అయితే దీనిపై భారత రాష్ట్ర సమితి నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. వివిధ రాజకీయ పార్టీలు సైతం పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశాయి.

దీంతో ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అభ్యంతరాలు తెలిపేందుకు పబ్లిక్ ఛాన్స్ ఇచ్చింది. గతంలో మరి ఏ పార్టీ పేరుకు రాని విధంగా రికార్డు స్థాయిలో దాదాపు 700కు పైగా అభ్యంతరాలు వచ్చాయి. ఈ అభ్యంతరాలపై తక్షణమే రాతపూర్వక వివరణ ఇవ్వాలంటూ ఈసీ కవితకు అధికారికంగా నోటీసులు జారీ చేసింది. అయితే అత్యధికంగా అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారు భారత రాష్ట్ర సమితికి చెందిన ముఖ్య నాయకులే కావడం గమనార్హం.

  • జాతీయ అవసరాల కోసం…

తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో సుదీర్ఘకాలం రాజకీయాలు చేశారు కేసీఆర్. జాతీయ రాజకీయాల కోసం టిఆర్ఎస్ పేరును బిఆర్ఎస్ గా మార్చుకున్నప్పటికీ.. తెలంగాణ ప్రజల గుండెల్లో టిఆర్ఎస్ అనే సెంటిమెంట్ బలంగా నాటుకు పోయి ఉందని గులాబీ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పుడు అదే అక్షరాల కలయికతో కవిత కొత్త పార్టీ పెడితే.. ఓటర్లు తీవ్ర గందరగోళానికి గురవుతారని.. దీనివల్ల భవిష్యత్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఊహంచని రాజకీయ నష్టం జరుగుతుందని గులాబీ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఈసీకి ఫిర్యాదులు పంపారు.

దీంతో ఎన్నికల సంఘం దీనిపై అభ్యంతరాల స్వీకరణకు సిద్ధమైంది. నిబంధనల ప్రకారం ఏదైనా ఒక కొత్త పార్టీ పేరు లేదా సంక్షిప్త నామం ఇప్పటికే ఉన్న మరో ప్రముఖ పార్టీ పేరును పోలి ఉంటే.. ఓటర్లను గందరగోళ పరిచేలా ఉంటే దానికి అనుమతి నిరాకరించే అధికారం ఈసీకి ఉంది.

  • గులాబీ పార్టీ గట్టి ప్రయత్నం..

గులాబీ పార్టీ నుంచి వేరుపడి కవిత సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. తన పార్టీ పేరును తెలంగాణ రక్షణ సేనగా ప్రకటించుకున్నారు. పూర్వపు టిఆర్ఎస్ పేరుకు ఉన్న సెంటిమెంటును సొంతం చేసుకోవాలని బలంగా భావించారు. తెలంగాణ రక్షణ సేనలో.. అక్షరమాలను అనుసరించి టిఆర్ఎస్ పేరుతో ముందుకు సాగాలని భావించారు. తప్పకుండా ఇది గులాబీ పార్టీకి నష్టం చేకూరుస్తుందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఈ పరిణామాల క్రమంలో ఎన్నికల కమిషన్ నిబంధనలను వినియోగించుకోవాలని భారత రాష్ట్ర సమితి అగ్రనేతలు భావించారు. అందుకే పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు.

ప్రస్తుతం ఈసీకి వచ్చిన 700 అభ్యంతరాల తీవ్రతను పరిశీలిస్తుంటే.. కవితకు టిఆర్ఎస్ అనే పేరు దక్కడం దాదాపు అసాధ్యం అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈసీ గనుక ఈ పేరును తిరస్కరిస్తే.. ప్రత్యామ్నాయంగా మరో కొత్త పేరును వెతుక్కోవాల్సిన పరిస్థితి కవితకు ఎదురుకానుంది. మరి ఆమె ఎటువంటి పేరును ప్రకటిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు