కరీంనగర్, క్రైమ్‌మిర్రర్: జిల్లాలో దారుణం జరిగింది. ఒక దుండగుడు కూలి పని ఇప్పిస్తానని తీసుకెళ్లి బంగారం లాక్కుని మహిళను బావిలో తోసేసాడు. బాధిత మహిళ 21 గంటలు బావిలోనే ఉండి, ప్రాణాలతో బయటపడింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కిసాన్ నగర్ ప్రాంతంలో గంగాధర లక్ష్మీ(55) అనే మహిళ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఎప్పటిలాగే లక్ష్మీని కూలి అడ్డ వద్ద కొడుకు సందీప్ దిగబెట్టాడు.
Also Read:సీఎం విజయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్!!
గుర్తు తెలియని వ్యక్తి వచ్చి కూలి పని ఉందని ఆమెతో ఒప్పందం చేసుకున్నాడు. నుస్తులాపూర్ గ్రామ శివారుకు తీసుకెళ్లి, ఉదయం 11 గంటల సమయంలో మహిళ వద్ద ఉన్న అర తులం బంగారం, 4వేల నగదు లాక్కుని ఆమెను బావిలో తోసేసాడు. మహిళ బావిలో ఉన్న తాడు పట్టుకుని పైకి రావడం గమనించి, తాడును కోసేసి వెళ్ళిపోయాడు.బాధితురాలు బావిలో ఈదుకుంటూ, మోటారుకున్న పైపును పట్టుకుని, ప్రాణాలు కాపాడుకుంది.
Also Read:కేతన్ హత్య కేసులో సంచలనం…తోసిందెవరో ఆధారాలు…!
రాత్రి అవుతున్నా తల్లి ఇంటికి రాకపోవడంతో బాధితురాలి కొడుకు సందీప్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా నుస్తులాపూర్ గ్రామం అంతా గాలించినా మహిళ ఆచూకీ లభించలేదు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు బావి దగ్గరికి వెళ్ళిన భూ యజమానికి కేకలు వినపడడంతో తొంగి చూసి, లోపల మహిళ ఉందని సమాచారం ఇవ్వడంతో గ్రామస్థులు ఆమెను బయటికి తీసారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలు తెలిపిన వివరాల ఆధారంగా కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Also Read:ఏసీబీ వలలో పోలీస్ డీఎస్పీ.. ఆస్తుల చిట్టాతో అధికార వర్గాల్లో కలకలం!