కెనడాలో ఒక విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక చిన్న నిర్లక్ష్యం ఎంత పెద్ద ప్రమాదానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. గబ్బిలం కారణంగా రేబీస్ వ్యాధి సోకి 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది.
2024లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇప్పుడు బయటకు రావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. సమ్మర్ సెలవుల్లో కుటుంబంతో కలిసి ఒంటారియో ప్రాంతానికి వెళ్లిన బాలుడు ఒక రోజు ఉదయం నిద్రలేవగానే తన ముఖంపై గబ్బిలం వాలినట్లు గమనించాడు. ఒక్కసారిగా భయంతో గబ్బిలాన్ని తోసేయగా, అతని అరుపులు విని తండ్రి అక్కడికి చేరుకుని ఆ గబ్బిలాన్ని పట్టుకుని బయటకు వదిలేశాడు.
తర్వాత బాలుడిని పరిశీలించిన కుటుంబ సభ్యులకు ఎలాంటి గాయాలు కనిపించకపోవడంతో పెద్దగా పట్టించుకోలేదు. ఇదే పెద్ద తప్పుగా మారింది. సుమారు 19 రోజుల తరువాత బాలుడి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడం ప్రారంభమైంది. వాంతులు, ముఖం మొద్దుబారడం వంటి లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.
వైద్యులు పరీక్షలు నిర్వహించగా బాలుడికి రేబీస్ సోకినట్లు నిర్ధారించారు. వెంటనే ఐసీయూలో చేర్చి చికిత్స ప్రారంభించినా, అప్పటికే వైరస్ మెదడుకు వ్యాపించడంతో పరిస్థితి అదుపులోకి రాలేదు. రెండు వారాలపాటు తీవ్ర చికిత్స అందించినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో చివరకు కుటుంబ సభ్యుల అనుమతితో లైఫ్ సపోర్ట్ తొలగించగా బాలుడు మరణించాడు.
స్థానిక అధికారుల ప్రకారం, ఒంటారియోలో గబ్బిలం ద్వారా రేబీస్ సోకి మరణించడం గత 50 సంవత్సరాల్లో ఇదే మొదటిసారి. ఈ ఘటన తర్వాత బాలుడి కుటుంబం ప్రజల్లో అవగాహన పెంచేందుకు ముందుకొచ్చింది. చిన్నపాటి జంతు సంపర్కాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదని వారు హెచ్చరిస్తున్నారు.
కాగా, రేబీస్ ఒక ప్రాణాంతక వైరల్ వ్యాధి. ఇది ఎక్కువగా కుక్కలు, గబ్బిలాలు వంటి జంతువుల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. గాయాలు కనిపించకపోయినా వైరస్ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గబ్బిలాల విషయంలో చిన్నపాటి తాకుడే ప్రమాదకరంగా మారొచ్చు. వెంటనే వైద్యులను సంప్రదించి రేబీస్ టీకా తీసుకోవడం మాత్రమే ప్రాణాలను రక్షించే మార్గంగా నిపుణులు చెబుతున్నారు.
also read: అటల్ టన్నెల్ సమీపంలో భయానక రోడ్డు ప్రమాదం – కారులోకి దూసుకెళ్లిన వంతెన ఇనుప కడ్డీలు- ఒకరు మృతి