మలయాళ సినీ పరిశ్రమలో మరో వివాదం తెరపైకి వచ్చింది. ప్రముఖ నటి అన్సిబా హసన్ చేసిన ఫిర్యాదుతో నటుడు టిని టామ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని ఎర్నాకుళం ట్రయల్ కోర్టు కడవంత్ర పోలీసులను ఆదేశించింది.
ఈ వ్యవహారం అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (AMMA) కార్యాలయంలో జరిగిన చర్చల సమయంలో జరిగిన ఘటనతో సంబంధం కలిగి ఉంది. ఆ సమయంలో టిని టామ్ తనను ‘జిహాదీ’ అని పిలిచారని, అలాగే ‘డబుల్ డాడీ సిండ్రోమ్’, ‘డీఎన్ఏ ఇష్యూ’ వంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అన్సిబా ఆరోపించారు.
మొదట పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేయడానికి ముందుకు రాకపోవడంతో, నటి న్యాయం కోసం ఎర్నాకుళం జుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి కావ్య సోమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరోపణల స్వభావాన్ని పరిశీలించిన కోర్టు, ఈ కేసు భారతీయ న్యాయ సంహిత (BNS), 2023లోని పలు సెక్షన్ల కిందకు వస్తుందని పేర్కొంది. మహిళ గౌరవాన్ని దెబ్బతీయడం, లైంగిక వేధింపులు, మతపరమైన భావాలను అవమానించడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయని స్పష్టం చేసింది.
ప్రాథమికంగా లభించిన ఆధారాల ప్రకారం ఇది పోలీసులకు నేరుగా జోక్యం చేసుకునే కాగ్నిజబుల్ నేరంగా కనిపిస్తోందని కోర్టు అభిప్రాయపడింది. అయితే నిందితుడి ఉద్దేశ్యం ఏమిటి అన్నది పూర్తి దర్యాప్తు తర్వాతే తేలుతుందని కూడా పేర్కొంది.
ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న నటి నీనా కురుప్ ఇచ్చిన స్టేట్మెంట్ను కోర్టు పరిశీలించింది. కొచ్చిలోని ‘అమ్మ’ కార్యాలయంలో ఈ వ్యాఖ్యలు జరిగినట్లు ఆమె పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఆ సమయంలో నటి శ్వేతా మీనన్ కూడా అక్కడే ఉన్నారని వెల్లడించారు. అయితే, ఆమెను పోలీసులు విచారించకపోవడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
టిని టామ్ చేసిన వ్యాఖ్యలు సరదాగా మాత్రమే ఉన్నాయని, నేరపూరిత ఉద్దేశ్యం లేదని పోలీసులు సమర్పించిన నివేదికను కోర్టు తిరస్కరించింది. పూర్తి స్థాయి దర్యాప్తు జరిపిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. అలాగే, ఈ కేసు పరిధిపై పోలీసుల అభ్యంతరాలను కూడా కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో అన్సిబా హసన్ తరఫున అడ్వకేట్లు ముహమ్మద్ ఫిరదౌస్ ఎవి, లిబిన్ వర్గీస్ వాదనలు వినిపించారు.
also read: సినిమా కోసం ఎంతో శ్రమించా: హీరో విరాట్ కర్ణ- ‘నాగబంధం’పై భారీ నమ్మకం.. డూప్ లేకుండా యాక్షన్ సీన్లు!