క్రైమ్ మిర్రర్, విశాఖపట్నం:- విశాఖలో ఘోరం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. చేతికి అంది వచ్చిన కుమారులు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నగర పరిధిలోని వడ్లపూడి – శ్రీనగర్ బ్రిడ్జిపై బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పొట్నూరు సతీష్ (27), పొట్నూరు గిరీష్ (26) మృతి చెందారు. విధులు ముగించుకొని ఇంటికి వస్తున్న వీరి బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వీరిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఢీ కొట్టిన బస్సు వెనుక చక్రాలు వారిపై నుంచి వెళ్లడంతో మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. కుమారుల మృతి వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు విలపిస్తున్నారు.
ఈ ఇద్దరు సోదరులు అక్కిరెడ్డిపాలెం సమీపంలోని వివేకానంద కాలనీలో తల్లిదండ్రులు వెంకటరమణ, కళావతితో కలిసి నివాసం ఉంటున్నారు. వీరిలో సతీష్ అనకాపల్లిలోని రిలయన్స్ ప్రమోటరుగా, చిన్న కుమారుడు పొట్నూరు గిరీష్ అనకాపల్లి బజాజ్ షోరూం లో ప్రమోటరుగా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం తమ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై ఇద్దరూ విధులకు వెళ్లారు. రాత్రి విధులు ముగించుకొని ఇంటికి చేరుకుంటారు. కానీ మంగళవారం రాత్రి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వారికి ఫోన్ చేసినా కలవకపోవడంతో వారంతా బయోందోలున చెందారు. వీరిద్దరూ బుధవారం తెల్లవారుజామున అనకాపల్లి నుంచి తమ ద్విచక్ర వాహనంపై వస్తుండగా నాలుగు గంటల సమయంలో విజయవాడ నుంచి విజయనగరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వడ్లపూడి – శ్రీనగర్ బ్రిడ్జిపై వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో వారు కుడి వైపునకు రోడ్డుపై పడిపోయారు. వారి మీదుగా బస్సు వెనుక చక్రాలు వెళ్లిపోవడంతో ఇద్దరూ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. వాహన చోదకులు పోలీసులకు సమాచారాన్ని ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు.
కుమారులు రాకపోవడంతో భయాందోళన చెందిన తల్లిదండ్రులు..
సాధారణంగా కుమారులు విధులు ముగించుకొని కలిసే రాత్రి సమయంలో ఇంటికి చేరుకుంటారు. కానీ మంగళవారం రాత్రి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఫోన్ చేస్తూనే ఉన్నారు. అయితే ఫోన్ కలవకపోవడంతో ఏం చేయాలో తెలియని దిక్కు తోచని స్థితిలో వాళ్లంతా ఉండిపోయారు. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో గిరీష్ కు తండ్రి ఫోన్ చేశారు. ఫోన్ పోలీసులు లిఫ్ట్ చేసి సమాచారాన్ని అందించారు. దీంతో తల్లిదండ్రులతో పాటు ఇతర కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ నుంచి కేజీహెచ్ కి వెళ్లారు. తమ కుమారులు మృతి చెందడానికి నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసిన ఆర్టీసీ డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేతికి అంది వచ్చిన కుమారులు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా మారింది. ఇది ఇలా ఉంటే అనకాపల్లి నుంచి రోజు ఇంటికి రావడం ఇబ్బందిగా మారుతోందన్న ఉద్దేశంతో అనకాపల్లిలోనే ఇద్దరు సోదరులు ఇల్లును తాజాగా చూసినట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల్లోనే అనకాపల్లికి షిఫ్ట్ అయిపోయి అక్కడి నుంచే విధులు చేసుకోవాలని భావించారు. ఈ లోగా విధి వారిని ప్రమాదం రూపంలో కబలించింది. తమ పిల్లలను కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఒక డ్రైవర్ నిర్లక్ష్యం తమ కుటుంబాన్ని రోడ్డుపాలు చేసింది అంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.