-
సీఎం రేవంత్ షో ఆఫ్ చేస్తున్నారంటూ రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్
-
యాదాద్రి ట్రస్ట్ బోర్డు నియామకం పై అభ్యంతరం
-
ఇకనుంచి పట్టించుకోకూడదని సీఎం రేవంత్ నిర్ణయం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై బాహటంగానే మళ్లీ విమర్శలు చేయడం ప్రారంభించారు. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న వారికి కనీసం విలువ లేకుండా పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒరిజినల్ కాంగ్రెస్ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు.
ఇతర పార్టీల నుంచి చేరిన వారికి కాంగ్రెస్ లో పదవులు కట్టబెడుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే కోమటిరెడ్డి సైతం బిజెపి నుంచి వచ్చారన్న విషయాన్ని మాత్రం మరిచిపోతున్నారు. గత కొంతకాలంగా మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. నల్గొండలో జరిగిన సీఎం రేవంత్ సభకు సైతం మొకం చాటేసారు. ఈరోజు మీడియా ముందుకు వచ్చి సీఎం రేవంత్ తీరుపై విమర్శలు చేశారు.
-
సంచలన ఆరోపణలు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షేత్రస్థాయి పనికంటే కేవలం షో ఆఫ్ చేయడమే ఎక్కువైంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. భువనగిరి జిల్లాలో తాను కీలక నేతగా ఉన్నప్పటికీ.. తన పరిధిలోని యాదాద్రి దేవస్థానం బోర్డు నియామకాల విషయంలో కనీస సమాచారం ఇవ్వకపోవడం పై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
నిన్న కాక మొన్న కొత్తగా పార్టీలో చేరిన వారికి పదవులు ఇస్తూ.. వారి పెత్తనాన్ని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. సీఎం ఏకపక్ష వైఖరి నచ్చక తాను నల్గొండలో అధికారిక సభకు హాజరు కాలేదని స్పష్టం చేశారు.
-
కాంగ్రెస్ వర్గాల్లో చర్చ..
ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారితీసింది. మంత్రి పదవి ఇవ్వరన్న క్లారిటీతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రేవంత్ రెడ్డి సైతం రాజగోపాల్ రెడ్డి విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వాలో అంతవరకు ఇస్తున్నారు.
గతంలో పార్టీ మారిన చరిత్ర ఉన్నందున.. రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ హై కమాండ్ పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదన్న టాక్ వినిపిస్తోంది. సొంత నియోజకవర్గంలో సైతం రాజగోపాల్ రెడ్డికి పట్టు సడలుతోందని.. ఆయన విషయంలో పట్టించుకోవాల్సిన పనిలేదని సీఎం రేవంత్ సైతం ఒక నిర్ణయానికి వచ్చారని సమాచారం. తన సభకు గైర్హాజరైన రాజగోపాల్ రెడ్డి విషయంలో ఇకనుంచి కఠినంగా ఉండాలని కూడా రేవంత్ డిసైడ్ అయినట్లు ప్రచారం సాగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో…