-
డెలివరీ బాయ్ వివాదంపై హీరో అఖిల్ రాజ్ క్లారిటీ..
-
అమ్మను తిట్టడంతోనే ఆవేశం వచ్చింది
Crime Mirror, Telangana State Buearo: రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో అఖిల్ రాజ్ ఇటీవల డెలివరీ బాయ్‌తో జరిగిన గొడవ కారణంగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తనపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలకు తాజాగా అఖిల్ రాజ్ స్పందిస్తూ వీడియో విడుదల చేశారు. తాము ఎలాంటి కారణం లేకుండా డెలివరీ బాయ్‌పై దాడి చేయలేదని, జరిగిన సంఘటన వెనుక అసలు నిజం వేరేలా ఉందని ఆయన వివరించారు.
అఖిల్ రాజ్ తెలిపిన వివరాల ప్రకారం, తమ ఇంటికి రావాల్సిన పార్సిల్ కాకుండా పక్క అపార్ట్‌మెంట్‌కు చెందిన ఆర్డర్‌ను డెలివరీ బాయ్ పొరపాటున తమ ఇంటికి ఇచ్చాడని చెప్పారు. పార్సిల్‌పై వేరే అపార్ట్‌మెంట్ అడ్రస్ ఉన్నప్పటికీ అది తమ ఇంటికి అందించాడని, ఇంట్లో వాళ్లు తమలో ఎవరో ఆర్డర్ చేశారేమో అనుకుని తీసుకున్నారని వెల్లడించారు.
కొంతసేపటి తర్వాత డెలివరీ బాయ్ మళ్లీ వచ్చి పార్సిల్ తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడని, అప్పుడే అడ్రస్ సరిచూసుకోలేదా అని ప్రశ్నించగా దురుసుగా మాట్లాడాడని అఖిల్ అన్నారు. అంతేకాకుండా అతను మద్యం మత్తులో ఉన్నట్లు అనిపించిందని, తమ తల్లితో కూడా అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. తన తల్లి క్షమాపణ చెప్పి పార్సిల్ తిరిగి ఇచ్చినా, డెలివరీ బాయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కోపం వచ్చిందని చెప్పారు.
ఈ ఘటనలో తాము అతనిపై భౌతిక దాడి చేయలేదని అఖిల్ స్పష్టం చేశారు. అతను మొబైల్‌తో వీడియో తీయడం ప్రారంభించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిందని తెలిపారు. తాను కేవలం అతన్ని ఆపేందుకు మాత్రమే ప్రయత్నించానని, కొట్టాలనే ఉద్దేశం లేదన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒక్క కోణంలో మాత్రమే ఉందని, పూర్తి సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అసలు నిజం బయటపడుతుందని చెప్పారు.
నేను కూడా ఒకప్పుడు డెలివరీ బాయ్‌గా పనిచేశాను. ఆ ఉద్యోగం విలువ నాకు తెలుసు. కారణం లేకుండా ఎవ్వరినీ అవమానించే వ్యక్తిని కాదు. కానీ నా తల్లిని ఎవరైనా అవమానిస్తే ఒక కొడుకుగా స్పందించడం సహజం అని అఖిల్ రాజ్ అన్నారు. తన తల్లి డెలివరీ బాయ్ ముఖంపై ఉమ్మేసిందన్న ఆరోపణలను కూడా ఆయన ఖండించారు.
ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అఖిల్ వెల్లడించారు. ఒకవేళ తమవైపు తప్పు ఉందని నిరూపితమైతే ఎలాంటి సంకోచం లేకుండా క్షమాపణ చెబుతానని తెలిపారు. అయితే పూర్తి నిజాలు బయటకు రాకముందే సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శించడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతుండగా, పోలీసుల విచారణ తర్వాత అసలు విషయం ఏంటో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.