HomeసినిమాHoney Rose Row: కేసు నమోదయ్యాక మారిన స్వరం.. హనీ రోజ్‌కు సారీ చెప్పిన వ్యాపారవేత్త!

Honey Rose Row: కేసు నమోదయ్యాక మారిన స్వరం.. హనీ రోజ్‌కు సారీ చెప్పిన వ్యాపారవేత్త!

మలయాళ సినీ నటి హనీ రోజ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యాపారవేత్త చెమ్మనూర్‌ తాజాగా బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తూ తన వ్యాఖ్యలు హనీ రోజ్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులను కూడా బాధపెట్టాయని అంగీకరించారు. తన ఉద్దేశం ఆమె మనోభావాలను దెబ్బతీయడం కాదని, జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు.

ఇటీవల ఓ జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హనీ రోజ్ పాల్గొన్నారు. అదే కార్యక్రమంలో చెమ్మనూర్ ఆమె గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆ వ్యాఖ్యలు తనను అవమానించేలా, లైంగిక భావన కలిగేలా ఉన్నాయని హనీ రోజ్ ఆరోపించారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి చెమ్మనూర్‌పై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో చెమ్మనూర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. హనీ రోజ్‌కు తన వ్యాఖ్యల వల్ల బాధ కలిగిందని ఇప్పుడు తనకు అర్థమైందన్నారు. ఆమెను మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు. ఈ వివాదం సానుకూలంగా ముగియాలని కోరుకుంటున్నానని, తనపై నమోదైన క్రిమినల్ కేసును హనీ రోజ్ ఉపసంహరించుకుంటారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.

మరోవైపు హనీ రోజ్ కూడా ఈ అంశంపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. తన రూపంపై వచ్చే సరదా జోక్స్‌, మీమ్స్‌ ను పెద్దగా పట్టించుకోనని, వాటిని తాను సహజంగానే స్వీకరిస్తానని చెప్పారు. అయితే, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా లేదా అసభ్యకరంగా మాట్లాడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోనని హెచ్చరించారు.

సోషల్ మీడియాలో కానీ, బహిరంగ వేదికలపై కానీ మహిళల గురించి హద్దులు దాటి వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని ఆమె అభిప్రాయపడ్డారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోనని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం మలయాళ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. చెమ్మనూర్ చేసిన బహిరంగ క్షమాపణ తర్వాత హనీ రోజ్ ఎలా స్పందిస్తారు? కేసు కొనసాగుతుందా? లేదంటే ఉపసంహరించుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు