నటి ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె నటించిన ‘ఇసకపట్నం’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఐశ్వర్య రాజేష్, సినిమాతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ‘సెల్ఫ్ లవ్’ గురించి మాట్లాడారు. ముందుగా మనల్ని మనం ప్రేమించుకోవడం నేర్చుకోవాలని, ఆ తర్వాతే ఇతరులపై ప్రేమ చూపించగలమని అన్నారు. జీవితంలో ఎంత కష్టపడ్డామో, ఆ కష్టానికి గుర్తుగా అప్పుడప్పుడు మనకు నచ్చిన బహుమతిని మనమే కొనుక్కోవడంలో ఎలాంటి తప్పు లేదని చెప్పారు. అలా చేసుకోవడం వల్ల కలిగే ఆనందం ప్రత్యేకంగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇంటర్వ్యూలో యాంకర్.. “మీ దగ్గర ఉన్న అత్యంత ఖరీదైన వస్తువు ఏది?” అని అడగగా, ఐశ్వర్య రాజేష్ తన చేతికి ఉన్న విలాసవంతమైన వాచ్‌ను చూపించారు. ఆ వాచ్ ధర దాదాపు రూ.15 లక్షలు అని వెల్లడించారు. అంతేకాదు, ఆ ఖరీదైన వాచ్‌ను తనకు మరెవరూ గిఫ్ట్‌గా ఇవ్వలేదని, తానే స్వయంగా కొనుక్కున్నానని చెప్పారు.
ప్రతి సినిమా పూర్తయిన తర్వాత లేదా ఒక మంచి ప్రాజెక్ట్‌లో నటించినప్పుడు తనకు నచ్చిన ఒక వస్తువును గిఫ్ట్‌గా కొనుగోలు చేసుకోవడం తన అలవాటు అని తెలిపారు. గతేడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విజయవంతమైన తర్వాత ఈ రూ.15 లక్షల వాచ్‌ను కొనుగోలు చేసినట్లు చెప్పారు.
కష్టపడి సంపాదించిన డబ్బుతో మనకు ఇష్టమైన వస్తువును కొనుగోలు చేయడం ఎంతో సంతృప్తిని ఇస్తుందని ఐశ్వర్య రాజేష్ అన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చాలా మంది నెటిజన్లు ఆమె ఆలోచనను అభినందిస్తూ, “సెల్ఫ్ లవ్ కూడా జీవితంలో చాలా ముఖ్యం” అంటూ కామెంట్లు చేస్తున్నారు.