క్రైమ్ మిర్రర్, భూపాలపల్లి ప్రతినిధి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భూపాలపల్లి ఆర్టీవో కార్యాలయం ఎదుట వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో డీటీవో వెంకన్నను ఓ లారీ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే స్థానికులు, సహచర అధికారులు ఆయనను ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. ఇటీవలే భూపాలపల్లి జిల్లాలో విధుల్లో చేరిన వెంకన్న తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అదుపుతప్పిన లారీ ఆయనను ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వెంకన్న గతంలో ములుగు జిల్లాలో విధులు నిర్వహించి, ఇటీవల బదిలీపై భూపాలపల్లి జిల్లాకు వచ్చారు. క్రమశిక్షణ, విధి నిర్వహణలో నిబద్ధత కలిగిన అధికారిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఆయన ఆకస్మిక మృతి పట్ల రవాణా శాఖ అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు, సహచర ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనతో భూపాలపల్లి జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.