Homeఆంధ్ర ప్రదేశ్చిన్న, చిన్న కారణాలకే.. ఏపీలో రెండు ఘటనల్లో ఏడుగురు ఆత్మహత్య!!

చిన్న, చిన్న కారణాలకే.. ఏపీలో రెండు ఘటనల్లో ఏడుగురు ఆత్మహత్య!!

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో నిండు ప్రాణాలు బలవుతున్నాయి. ఇటీవల కాలంలో చిన్న, చిన్నకారణాలకే కుటుంబాల్లో కలహాలు మొదలై ఆత్మహత్యల వరకు వెళుతున్నాయి. తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటూ చిన్నారుల జీవితాలను బలి తీసుకుంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఒకే రోజు జరిగిన రెండు ఘటనలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ప్రకాశం జిల్లాలో నలుగురు, శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు ప్రాణాలు తీసుకున్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం అగ్రహారంలో ఎకుల సుధాకర్‌ తన ముగ్గురు పిల్లలను చంపేసి ఆత్యహత్య చేసుకున్నాడు. భార్య కాపురానికి రాలేదని మనస్తాపం చెందిన సుధాకర్ కుమార్తెలు గోచిత, పూజిత, లోకిత శ్రీకి విషమిచ్చాడు. ముగ్గురు కూతుళ్లు చనిపోయిన తర్వాత సుధాకర్ ఊరి చివర పొలం దగ్గర చెట్టుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సుధాకర్ స్థానికంగా ఉన్న గ్రానైట్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్యపై కోపంతో సుధాకర్ ముగ్గురు పిల్లల్ని బలి తీసుకున్నాడు.

శ్రీకాకుళం జిల్లాలో మరో దారుణం జరిగింది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్యహత్య చేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున పలాస-తాళభద్ర మధ్య రైలు పట్టాలపై ముగ్గురి మృతదేహాలను స్థానికులు గుర్తించారు. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలికి చేరుకున్నారు. ముగ్గురి మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం తరలించారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న ముగ్గురి వివరాలు తెలియాల్సి ఉంది. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నారా?.. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. ఇటీవల కాలంలో చిన్న, చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు పెరిగిపోయాయి. భార్య కాపురానికి రాలేదని భర్త, ఇంట్లో తల్లిదండ్రులు మొబైల్ ఇవ్వలేదని పిల్లలు, పరీక్షల్లో పాస్ కాలేదని విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. కొన్ని ఘటనల్లో మరీ దారుణంగా రిమోట్ కోసం గొడవపడి ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా చాలానే చూశాం.. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు