బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ మళ్లీ వెండితెరపై కనిపించబోతోంది. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె త్వరలో కొత్త ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. కత్రినా చివరిసారిగా 2024లో విడుదలైన ‘మేరీ క్రిస్టమస్’ సినిమాలో కనిపించింది. తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి స్పందన లభించింది. ఆ సినిమా తర్వాత ఆమె నుంచి ఎలాంటి కొత్త సినిమా ప్రకటన రాలేదు. దీంతో అభిమానులు ఆమె నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘చాందినీ బార్’ సీక్వెల్ లో కత్రినా..
ఇదిలా ఉండగా, 2025 నవంబర్ లో కత్రినా బిడ్డకు జన్మనిచ్చినట్లు వార్తలు వచ్చాయి. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలనే ఉద్దేశంతో ఆమె సినిమాలకు కొంత విరామం ఇచ్చినట్లు బాలీవుడ్ లో ప్రచారం జరిగింది. దీంతో ఆమె కొంతకాలం సినీ కార్యక్రమాలకు కూడా దూరంగా కనిపించింది. ఇప్పుడు కత్రినా రీ ఎంట్రీపై మరోసారి చర్చ మొదలైంది. ప్రముఖ దర్శకుడు మధుర్ బండార్కర్ తెరకెక్కించిన ‘చాందినీ బార్’ సినిమాకు సీక్వెల్ రూపొందనున్న సంగతి తెలిసిందే. 2001లో విడుదలైన ఈ చిత్రంలో టబు ప్రధాన పాత్రలో నటించి ప్రేక్షకులను, విమర్శకులను ఆకట్టుకున్నారు. ఆమె నటనకు ఎన్నో ప్రశంసలు లభించాయి.
గత ఏడాది ‘చాందినీ బార్ 2’ ప్రకటన
గత ఏడాది ‘చాందినీ బార్ 2’ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ‘సెక్షన్ 375’ చిత్రంతో గుర్తింపు పొందిన దర్శకుడు అజయ్ బహల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అయితే కథానాయికగా ఎవరు నటిస్తారనే విషయాన్ని అప్పట్లో ప్రకటించలేదు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ప్రధాన పాత్ర కోసం కత్రినా కైఫ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఈ వార్త నిజమైతే, కత్రినా కైఫ్ అభిమానులకు గుడ్ న్యూస్ గా చెప్పొచ్చు. చాలా కాలం తర్వాత ఆమె మళ్లీ ప్రధాన పాత్రలో కనిపించే అవకాశం ఉండటంతో సినీప్రియుల్లో ఆసక్తి నెలకొంది.