హైదరాబాద్ నగరంలో ఒక విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.
సమాచారం ప్రకారం, కర్ణాటక రాష్ట్రం బీదర్ ప్రాంతానికి చెందిన ఈ కుటుంబం ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి, నారాయణగూడలోని విఠల్‌వాడి ప్రాంతంలో నివసిస్తోంది. ఇటీవల వారి ఇంటికి వచ్చిన బంధువు తీసుకొచ్చిన మామిడి పండ్లను తల్లి, నలుగురు కుమార్తెలు కలిసి తిన్నారు.

ఆదివారం సాయంత్రం తర్వాత నుంచి వారికి ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. పరిస్థితి విషమించడంతో వారిని వెంటనే కాచిగూడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలో పెద్ద కుమార్తె భువనేశ్వరి (17) సోమవారం మృతి చెందింది. అనంతరం ఆమె చెల్లెలు సంధ్య (10) కూడా మంగళవారం ప్రాణాలు కోల్పోయింది.
మిగిలిన తల్లి మరియు మరో ఇద్దరు పిల్లలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై అసలు కారణం ఏమిటన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మామిడి పండ్ల వల్లే అనర్థం జరిగిందా? లేక మరే ఇతర కారణాలున్నాయా? అనే కోణాల్లో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు పోస్టుమార్టం మరియు వైద్య నివేదికల తర్వాత వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
also read: Snake Wine: సీసాలో పాము పెట్టి తాగే మద్యం… ఇదేం భయంకర ట్రెండ్?