మధ్యప్రదేశ్‌లో ఓ ప్రభుత్వ అధికారి ఆస్తుల వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అవినీతి నిరోధక సంస్థ లోకాయుక్త నిర్వహించిన సోదాల్లో మహిళా, శిశు అభివృద్ధి శాఖ సంయుక్త డైరెక్టర్ లక్ష్మీనారాయణ్ కంద్వాల్ కుటుంబానికి చెందిన భారీ ఆస్తులు బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. ఆయనకు సంబంధించిన ఇళ్లు, వ్యాపార సంస్థలు, ఇతర ప్రాంగణాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించగా సుమారు రూ.11 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించినట్లు తెలిపారు.
కుట్టు మిషన్ నడిపి కోట్ల సంపాదన
దర్యాప్తు సందర్భంగా అధికారులను ఎక్కువగా ఆశ్చర్యపరిచిన విషయం ఆయన చెప్పిన వివరణ. ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఎలా సమకూరాయనే ప్రశ్నకు, తన భార్య కుట్టు మరియు అల్లిక పనులు చేస్తూ సంపాదించిన ఆదాయం వల్లే ఈ ఆస్తులు కూడబెట్టగలిగామని లక్ష్మీనారాయణ్ చెప్పినట్లు సమాచారం. ఈ వివరణ విన్న అధికారులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. అధికారుల వివరాల ప్రకారం, లక్ష్మీనారాయణ్ 1996 నుంచి ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగుతున్నారు. ఈ కాలంలో ఆయన పొందిన మొత్తం వేతనం సుమారు రూ.2.5 కోట్లుగా అంచనా వేశారు. వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని కలిపినా కుటుంబానికి చట్టబద్ధంగా వచ్చిన మొత్తం ఆదాయం రూ.2.8 కోట్ల వరకు మాత్రమే ఉంటుందని అధికారులు గుర్తించారు.
ఆదాయానికి మించిన ఆస్తులు
అయితే ఇప్పటివరకు సేకరించిన వివరాల ప్రకారం ఆయన కుటుంబానికి చెందిన స్థిర, చర ఆస్తుల మొత్తం విలువ రూ.10.83 కోట్లకు మించి ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కోణంలో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. సోదాల సమయంలో భారీ నివాస భవనం, పలు ప్లాట్లు, డిపార్ట్ మెంటల్ స్టోర్, జిమ్‌కు సంబంధించిన ఆస్తులు, నగదు, బంగారం, వెండి ఆభరణాలు మరియు ఇతర విలువైన వస్తువులు బయటపడ్డాయి. ఇంట్లో లభించిన వస్తువుల విలువ దాదాపు రూ.38.49 లక్షలు కాగా, బ్యాంక్ లాకర్‌లో ఉన్న బంగారం, వెండి ఆభరణాల విలువ సుమారు రూ.24.76 లక్షలుగా అంచనా వేశారు.