Homeక్రీడలుAustralian Open: పీవీ సింధు, తన్వీ శర్మ మెరుపులు.. క్వార్టర్స్‌ లోకి భారత షట్లర్లు!

Australian Open: పీవీ సింధు, తన్వీ శర్మ మెరుపులు.. క్వార్టర్స్‌ లోకి భారత షట్లర్లు!

ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు మంచి ప్రదర్శన కొనసాగిస్తున్నారు. మహిళల సింగిల్స్ విభాగంలో స్టార్ షట్లర్ పీవీ సింధుతో పాటు యువ క్రీడాకారిణి తన్వీ శర్మ కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరి భారత అభిమానులను ఆనందపరిచారు.

రెండో రౌండ్ పోటీల్లో పీవీ సింధు తన సహచర భారత షట్లర్ ఇషారాణితో తలపడింది. తొలి గేమ్‌లో ఇషారాణి నుంచి గట్టి పోటీ ఎదురైనా సింధు అనుభవాన్ని ప్రదర్శిస్తూ 22-20తో గేమ్‌ను సొంతం చేసుకుంది. అనంతరం రెండో గేమ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఆమె 21-12తో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌లో అడుగుపెట్టింది.

మరోవైపు కేవలం 17 ఏళ్ల వయసున్న తన్వీ శర్మ కూడా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. భారత షట్లర్ మాళవిక బన్సోద్‌తో జరిగిన మ్యాచ్‌లో తన్వీ ఆత్మవిశ్వాసంతో ఆడి 21-13, 21-15 తేడాతో వరుస గేమ్‌ల్లోనే గెలుపొందింది. ఈ విజయంతో ఆమె కూడా చివరి ఎనిమిది మంది ఆటగాళ్లలో చోటు దక్కించుకుంది.

పురుషుల డబుల్స్ విభాగంలో భారత జోడీ ఎం.ఆర్. అర్జున్, హరిహరన్‌లు కూడా విజయవంతంగా తదుపరి దశకు చేరుకున్నారు. న్యూజిలాండ్‌కు చెందిన మైఖెల్ ఒవెన్, డైలాన్ సోయెడ్జాసా జంటపై వారు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. 21-17, 21-7 స్కోరుతో సులభంగా గెలిచి తదుపరి రౌండ్‌ కు అర్హత సాధించారు.

అయితే. భారత జట్టుకు అన్ని విభాగాల్లో విజయాలు దక్కలేదు. మహిళల సింగిల్స్‌ లో తాన్య తన మ్యాచ్‌లో ఓటమి చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అలాగే మిక్స్‌ డ్ డబుల్స్‌ లో ధ్రువ్, మనీష జోడీ కూడా తమ పోటీలో పరాజయం పాలై పోటీకి వీడ్కోలు పలికింది.

మొత్తంగా  ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత షట్లర్ల ప్రదర్శన ఆశాజనకంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పీవీ సింధు అనుభవం, తన్వీ శర్మ యువ ప్రతిభ అభిమానుల్లో మరింత ఆశలు రేకెత్తిస్తున్నాయి. క్వార్టర్ ఫైనల్‌లో కూడా వీరు ఇదే జోరు కొనసాగించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు