తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధ్యక్షుడు విజయ్ మరియు ఆయన భార్య సంగీతకు సంబంధించిన విడాకుల కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ కేసు విచారణ ఈ నెల 15న చెంగల్పట్టు జిల్లా కుటుంబ సంక్షేమ కోర్టులో జరగనుంది. దీంతో ఈ విచారణపై రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ విజయం సాధించి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ కేసు కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ కేసు తదుపరి విచారణకు రానుంది.
విజయ్ కోర్టుకు హాజరయ్యేనా?
కోర్టు ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించడంతో ఇరు పక్షాల హాజరుపై చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న విజయ్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యే అవకాశం తక్కువగా ఉందని ఆయన తరపు వర్గాలు చెబుతున్నాయి. అధికారిక కార్యక్రమాలు, భద్రతా కారణాల వల్ల ఆయన నేరుగా కోర్టుకు రావడం కష్టమని భావిస్తున్నారు. అయితే సంగీత మాత్రం విచారణకు హాజరయ్యే అవకాశం ఉందని ఆమె తరపు న్యాయవర్గాలు వెల్లడించాయి. అదే సమయంలో, కోర్టు అనుమతి మేరకు ఇద్దరూ తమ తమ న్యాయవాదులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొనే అవకాశమూ ఉన్నట్లు సమాచారం.
విచారణపై సర్వత్రా ఆసక్తి
ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి తుది నిర్ణయం వెలువడలేదు. సోమవారం జరిగే విచారణలో కోర్టు తదుపరి చర్యలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి విజయ్ రాజకీయ జీవితంలో కీలక దశ కొనసాగుతున్న సమయంలో ఈ కేసు మరోసారి చర్చకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కోర్టు విచారణ అనంతరం ఈ కేసులో తదుపరి పరిణామాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం అందరి దృష్టి సోమవారం జరగనున్న విచారణపైనే ఉంది.