Homeతెలంగాణకోలివింగ్ హాస్టల్స్ లో ఏం జరుగుతోంది...! న‌గ‌ర‌వాసుల్లో ఆందోళ‌న‌

కోలివింగ్ హాస్టల్స్ లో ఏం జరుగుతోంది…! న‌గ‌ర‌వాసుల్లో ఆందోళ‌న‌

హైదరాబాద్, క్రైమ్ మిర్ర‌ర్‌: హైదరాబాద్‌లో రోజురోజుకూ కో లివింగ్ కల్చర్ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే కో లివింగ్ హాస్టల్స్ పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి. అయితే ఇలాంటి కో లివింగ్ హాస్టల్‌లలో ఉండే యువతీ యువకులు.. తమ కుటుంబాలకు ఆ విషయం చెప్పకుండా.. ప్రియుడు, ప్రియురాలితో కలిసి ఉంటున్న వారే ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలోనే కో లివింగ్ హాస్టల్‌లలో ఉంటూ.. మనస్పర్ధలు ఏర్పడి విడిపోతున్న జంటలు చూస్తూనే ఉన్నాం. మరికొందరు అయితే హత్య చేయడం లేదా ఆత్మహత్యకు చేసుకుని.. ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ కో లివింగ్ కల్చర్ పెరిగిపోవడం పట్ల నగరవాసులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ కో లివింగ్ హాస్టల్స్‌ను సమర్థించే వారు కొందరు, విమర్శించే వారు మరికొందరు ఉండటంతో వీటిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.కో లివింగ్ హాస్టల్స్‌ నిర్వహణ తీరు, అందులో అసలు ఏం జరుగుతోంది.. ఈ కో లివింగ్ హాస్టల్స్ వల్ల యూత్ ఏ రకంగా ప్రభావితం అవుతోంది అనే విషయాలను తెలుసుకునేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వీ హనుమంత రావు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం నగరంలో నడుస్తున్న కో లివింగ్ హాస్టల్స్‌లో అసలు ఏం జరుగుతుందో క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

కో లివింగ్ హాస్టల్స్ పేరుతో అక్కడ జరుగుతున్న పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉందని వీహెచ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి.. అది అధ్యయనం చేసిన తర్వాత.. వాటిని పూర్తిగా రద్దు చేయాలా లేక ఇంకా కఠినమైన రూల్స్ తీసుకురావాలా అనే విషయంపై ఒక క్లారిటీ వస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి కో లివింగ్ హాస్టల్స్ పరిధిలో ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు మాత్రమే మీడియా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని తెలిపారు.కో లివింగ్ హాస్టల్స్‌లో ఉండటం అనేది అమ్మాయిల తప్పా లేక అబ్బాయిల తప్పా అనేది తెలుసుకోవాలని వీహెచ్ హితవు పలికారు.

ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలంటే.. ఒక హై లెవల్ కమిటీ ద్వారా సమగ్రంగా విచారణ చేయించి.. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీంతో వీహెచ్ చేసిన సూచనపై ఆలోచించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నెటిజన్లు సూచిస్తున్నారు.ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న ఓ కో లివింగ్ హాస్టల్‌పై నుంచి ఒక యువతి దూకి ప్రాణాలు తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రియుడి వేధింపులను తట్టుకోలని ప్రియురాలు.. అదే కో లివింగ్ హాస్టల్ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు కూడా గతంలో ఇలాంటి ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ కో లివింగ్ హాస్టల్స్‌లో ఉండే యువతీయువకులు చేసే పనులతో పరిసరాల్లో ఉండే నగరవాసులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు