Homeఆంధ్ర ప్రదేశ్విలువలతో కూడిన విద్యను అందించేలా.. కీలక మార్పుల దిశగా ఏపీ విద్యాశాఖ.!

విలువలతో కూడిన విద్యను అందించేలా.. కీలక మార్పుల దిశగా ఏపీ విద్యాశాఖ.!

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : ఏపీలో విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించడంతోపాటు విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఒకటో తరగతి నుంచి విలువలతో కూడిన విద్యను బోధించేలా కీలక మార్పులను చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గడిచిన ఏడాది ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు విలువల విద్యను అమలు చేసిన ప్రభుత్వం.. ఈ విద్యా సంవత్సరం నుంచి ఒకటవ తరగతి నుంచి అయిదు తరగతులకు కూడా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పుస్తకాలను ముద్రించి ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పుస్తకాలుగా మార్చారు. విద్యార్థులకు ఇంకా సులభంగా అర్థం కావాలనే ఉద్దేశంతో ఆయా పాఠ్యాంశాల సారాంశం ఆధారంగా కృత్రిమ మేధా తో ఫోటోల రూపొందించి ముద్రించారు. తల్లిదండ్రులను, గురువులను ఎలా గౌరవించాలి, కుటుంబంతో ఎలా మెలగాలి, మాటతీరు ఎలా ఉండాలి అనే అంశాలు ఇందులో పొందుపరిచినట్లు తెలుస్తోంది. అదే సమయంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, స్నేహభావం పై పాఠ్యాంశాల రూపొందించారు. మంచి మనో నిర్మాణం, ఏకాగ్రత, కోపాన్ని నియంత్రించుకోవడం, ఓర్పు, క్రమశిక్షణగా నడుచుకోవడం పై కొన్ని పాఠాలు పెట్టినట్లు చెబుతున్నారు. అలాగే ప్రకృతి విలువ, పర్యావరణ పరిరక్షణ పై విద్యార్థులకు అవగాహన కలిగేలా పాఠాలను రూపొందించారు. ఒక్కో పుస్తకాన్ని 45 నుంచి 50 పేజీలతో తయారు చేశారు. విద్యార్థులు విద్యాపరంగా రాణించడంతోపాటు భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా మారడమే విలువల విద్యా లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ పెట్టుకుంది. ఈ ఏడాది నుంచి విలువలు విద్యకు అత్యంత ప్రాధాన్యతలు ఇవ్వడంతో పాటు మార్పులు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ఉపాధ్యాయులకు కూడా ఆదేశాలను జారీ చేసినట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

పాఠ్యాంశాలు రూపొందించింది ఇలా..

విద్యార్థులకు ఒకటవ తరగతి నుంచి విలువలతో కూడిన విద్యను అందించే ఉద్దేశంతో ప్రత్యేక ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. తరగతులు వారీగా ఏయే అంశాలను బోధించాలన్న దానిపైన ఒక స్పష్టతను ఇవ్వడంతో పాటు పుస్తకాలను ముద్రించింది. ఒకటో తరగతి విద్యార్థులకు అమ్మ, నాన్న, గురువు, కుటుంబం యొక్క గొప్పతనాన్ని వారికి ఇవ్వాల్సిన గౌరవం గురించి తెలియజేయనున్నారు. రెండో తరగతి విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత, మాటతీరు, స్నేహం, అహింసా వంటి అంశాలపై ప్రాధాన్యతను ఇవ్వడంతో పాటు వాటి యొక్క విశిష్టతను తెలియజేయునన్నారు. మూడో తరగతి విద్యార్థులకు మంచి మనో నిర్మాణం, విద్య, ఏకాగ్రత, పట్టుదల వంటి అంశాలను గురించి తెలియజేయనున్నారు. నాలుగో తరగతి విద్యార్థులకు కోపం, ఓర్పు, కష్టపడడం, క్రమశిక్షణ వంటి అంశాలను గురించి తెలియజేయడంతో పాటు వాటి వలన కలిగే లాభాలు నష్టాలను వివరించనన్నారు. ఐదో తరగతి విద్యార్థులకు రహదారి, చెట్లు, నీటి విలువ, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాలను తెలియజేసేలా పాఠ్యాంశాల్లో ఆయా అంశాలను పొందుపరిచారు. వీటివలన ఉన్నతమైన వ్యక్తిత్వంతో కలిగిన విద్యార్థులుగా ఎదిగేలా చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యసాధనకు అనుగుణంగానే కీలకమైన మార్పులకు ఓటమి ప్రభుత్వం నాంది పలికింది. వీటివలన సత్ఫలితాలు వస్తాయని నిపుణులు కూడా చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు