పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ లో నెలకొన్న అంతర్గత విభేదాలు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీలో కొంతకాలంగా కొనసాగుతున్న అసంతృప్తి తాజాగా పార్లమెంట్ కు చేరింది. ఇటీవల టీఎంసీకి చెందిన పలువురు లోక్సభ సభ్యులు స్పీకర్ ఓం బిర్లాకు ఒక లేఖ అందజేసినట్లు తెలుస్తోంది. ఈ లేఖపై 19 మందికి పైగా ఎంపీలు సంతకాలు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సంతకం చేసిన వారిలో ప్రముఖ మాజీ క్రికెటర్, ఎంపీ యూసఫ్ పఠాన్, నటి, రాజకీయ నాయకురాలు సాయోని ఘోష్, సీనియర్ నేత మాలా రాయ్, బాలీవుడ్ నటుడు, ఎంపీ శత్రుఘ్న సిన్హా సహా మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది.
టీఎంసీలోని విభేదాలు మరింత తీవ్రం
ఈ పరిణామం టీఎంసీలోని విభేదాలు మరింత తీవ్రమవుతున్నాయనే సంకేతాలను ఇస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీలో అసంతృప్తిగా ఉన్న ఎంపీలు భవిష్యత్ రాజకీయ వ్యూహంపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దీంతో టీఎంసీ భవిష్యత్తుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ప్రస్తుతం లోక్సభలో టీఎంసీకి 28 మంది సభ్యులు ఉన్నారు. అందులో ఎక్కువ మంది ఎంపీలు పార్టీ నిర్ణయాలపై అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
పార్లమెంట్ లో ప్రత్యేక వర్గంగా..
అసంతృప్త నేతలు వెంటనే పార్టీకి రాజీనామా చేయడం, బీజేపీలో చేరడం వంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని పార్టీకి దగ్గరగా ఉన్న వర్గాలు చెబుతున్నాయి. దీనికి బదులుగా పార్లమెంట్లో ప్రత్యేక వర్గంగా వ్యవహరించే అవకాశాన్ని వారు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే ఎన్డీఏ ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతు ఇవ్వాలనే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధానం ద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత సమస్యలను తప్పించుకోవచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలు టీఎంసీ అంతర్గత రాజకీయాల్లో కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.