Hometelanganaకాస్తులో ఉన్నవారికే పట్టాలు.. సాదాబైనామా ల్యాండ్స్ క్రమబద్ధీకరణకు ముహూర్తం ఫిక్స్

కాస్తులో ఉన్నవారికే పట్టాలు.. సాదాబైనామా ల్యాండ్స్ క్రమబద్ధీకరణకు ముహూర్తం ఫిక్స్

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తరతరాలుగా భూములను నమ్ముకుని, సాగు చేసుకుంటున్నప్పటికీ సాంకేతిక, రెవెన్యూ లోపాల వల్ల పట్టాదారు పాసుపుస్తకాలు అందక కొందరు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వారి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎంపిక చేసిన 70 రెవెన్యూ గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రతి అంగుళం భూమిని అత్యాధునిక సాంకేతికతతో సర్వే చేయిస్తున్నట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో వాస్తవంగా భూమి ఎవరి అధీనంలో ( కాస్తు/పొజిషన్‌లో) ఉంటే వారికే హక్కులు కల్పిస్తూ కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు అందజేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. తొలి విడతగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామంలో చేపట్టిన భూసర్వే విజయవంతమైందని మంత్రి వివరించారు. ఇదే నమూనాలో మిగిలిన 69 గ్రామాల్లోనూ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి అర్హులైన ప్రతి రైతుకూ పట్టాలు అందిస్తామన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. నాటి పాలకులు ప్రభుత్వ అవసరాల కోసం ఎక్కడైనా కొద్దిపాటి భూమిని సేకరిస్తే ఆ సర్వే నంబరు మొత్తాన్ని ధరణి పోర్టల్‌లో నిషేధిత భూముల జాబితా 22Aలో చేర్చి రైతులను గోస పెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా సర్వే నంబర్ల నుంచి నిజమైన పట్టా భూములను వేరు చేసి నిషేధిత జాబితా నుంచి తొలగించే ప్రక్రియను దాదాపు పూర్తి చేసిందని స్పష్టం చేశారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను పురస్కరించుకుని ఖమ్మంలో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. పాలేరు నియోజకవర్గాన్ని 14 క్లస్టర్లుగా విభజించి ప్రతి క్లస్టర్‌లోనూ తానే స్వయంగా ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. ఈ ప్రజాదర్బార్లకు దాదాపు 40 వేల మంది పేదలు, ఆపన్నులు తరలివచ్చారని ప్రభుత్వంపై వారికి ఉన్న అపార విశ్వాసానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. పాలేరు నుంచి మొత్తం 24,900 పైచిలుకు దరఖాస్తులు వచ్చాయని, విపక్షాలైన బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని కొట్టిపారేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు