HomeజాతీయంVizag Steel Plant Tragedy: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు...

Vizag Steel Plant Tragedy: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం ప్రకటన!

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ లో జరిగిన ఘోర ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అవసరమైన సహాయం అందించేందుకు స్థానిక అధికారులు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.

మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల సాయం

ఈ విషయాన్ని ప్రధాని తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయక నిధి (PMNRF) నుంచి ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. అలాగే గాయపడిన ప్రతి వ్యక్తికి రూ.50 వేల చొప్పున సహాయం అందించనున్నట్లు తెలిపారు.

ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి

సోమవారం విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని స్టీల్ మెల్టింగ్ స్టేషన్-2 విభాగంలో ఈ ప్రమాదం జరిగింది. విధుల్లో ఉన్న కార్మికులు పని చేస్తున్న సమయంలో మోల్టెన్ మెటల్ ల్యాడల్‌కు అనుసంధానమైన బకెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో ల్యాడల్‌లో ఉన్న అత్యంత వేడిగా ఉన్న ద్రవ లోహం కిందకు జారిపడింది. అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఆ ద్రవంలో మునిగిపోయారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురి పరిస్థితిపై వైద్యులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలన్నారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు