హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: దేశంలో సంచలనం సృష్టించిన నీట్ యూజీ ప్రశ్నాపత్రాలు లీకేజీ వ్యవహారంతో మరోసారి నీట్ పరీక్ష నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ పరీక్షను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. దేశ వ్యాప్తంగా ఈ నెల 21న నీట్ యూజీ పరీక్షను నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను అధికారులు చేశారు. గతంలో నిర్వహించిన పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీకేజీ వ్యవహారం దేశంలో సంచలనం సృష్టించడంతో ఈసారి అత్యంత పకడ్బందీగా పరీక్ష నిర్వహించడంపై ఎన్‌టీఏ దృస్టి సారించింది.
ముఖ్యంగా పరీక్షా పత్రాలను పరీక్షా కేంద్రాలకు తరలించే విషయంలో మరింత జాగ్రత్తలు పాటిస్తోంది. ఈ క్రమంలోనే పరీక్షా పత్రాలను దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పరీక్షా కేంద్రాలకు తరలించేందుకు ప్రత్యేకంగా విమానాలను వినియోగించేందుకు ఎన్‌టీఏ సిద్ధపడుతున్నట్టు తెలిసింది. అత్యంత పకడ్బందీగా పరీక్ష నిర్వహించే ఉద్ధేశంతో భారత వైమానికి దళ సాయాన్ని ఎన్‌టీఏ కోరింది. వైమానికి దళానికి చెందిన విమానాల్లో పరీక్ష పత్రాలను తరలించే యోచనలో ఎన్‌టీఏ ఉంది. అదే జరిగితే ఒక పరీక్ష కోసం విమానాలను వినియోగించిన తొలి పరీక్షగా నీట్ రికార్డు సృష్టించనుంది.
అత్యున్నత స్థాయి భద్రతా ప్రమాణాలు…
నీట్ పరీక్ష ఏర్పాట్లకు సంబంధించి ఉన్నతస్థాయి అధికారులతో సమావేశాన్ని తాజాగా నిర్వహించారు. ఈ సమావేశంలో పరీక్షల పారద్శకత, భద్రతను కాపాడే ఉద్ధేశంతో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యున్నత స్థాయి భద్రతా ప్రోటోకాల్స్‌ను అమలు చేస్తున్న ఎన్‌టీఏ అధికారులు చెబుతున్నారు. పరీక్ష ప్రక్రియ సమగ్రత, భద్రతను కాపాడే ఉద్ధేశంతో కీలక నిర్ణయాలను ఎన్‌టీఏ తీసుకుంటోంది. ప్రశ్నాపత్రాల రవాణా కోసం తొలిసారిగా భారత వైమానిక దళాన్ని వినియోగిస్తున్నట్టు ఎన్‌టీఏ డైరక్టర్ అభిషేక్ సింగ్ తాజాగా వెల్లడించారు. దీనిపై గతంలో మాట్లాడిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
జూన్‌లో ఉండే వాతావరణ పరిస్థితులు, రవాణా ఇబ్బందులు, భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకుని ప్రశ్నాపత్రాలను సురక్షితంగా, సకాలంలో తరలించేందుకు వైమానిక దళ సహాయం తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. అయితే, కేవలం ప్రశ్నాపత్రాల కోసం మాత్రమే వైమానిక దళం సహాయం తీసుకుంటామని భద్రత కోసం మరే సాయం తీసుకోబోమని స్పష్టం చేశారు. గత మే మూడో తేదీన జరిగిన నీట్ యూజీ-2026 పరీక్షను ప్రశ్నాపత్రాల లీకేజీ వల్ల రద్దు చేస్తున్నట్టు మే 12న ఎన్‌టీఏ ప్రకటించింది.