క్రైమ్ మిర్రర్,హెల్త్ న్యూస్ :-స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయాయి. ఉదయం నిద్రలేవగానే చూసేది ఫోన్, రాత్రి నిద్రపోయే ముందు చేతిలో ఉండేది కూడా ఫోనే. దీంతో చాలామంది మొబైల్‌ను దిండు కింద లేదా తలకు దగ్గరగా పెట్టుకుని నిద్రపోవడం అలవాటుగా మార్చుకున్నారు. కానీ ఈ చిన్న అలవాటు ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.మొబైల్ స్క్రీన్ నుంచి వెలువడే బ్లూ లైట్ శరీరంలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఈ హార్మోన్ మంచి నిద్రకు చాలా అవసరం. పడుకునే ముందు ఎక్కువసేపు ఫోన్ వాడటం వల్ల నిద్ర పట్టడంలో ఆలస్యం అవుతుంది. అంతేకాదు రాత్రి మధ్యలో మేల్కొనడం, ఉదయం అలసటగా అనిపించడం, తలనొప్పి వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
చాలామంది చేసే మరో ప్రమాదకరమైన పని ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టి దిండు కింద ఉంచడం. ఫోన్ పనిచేస్తున్నప్పుడు లేదా ఛార్జింగ్ అవుతున్నప్పుడు వేడి ఉత్పత్తి అవుతుంది. దిండు లేదా పరుపు ఆ వేడిని బయటకు వెళ్లనివ్వవు. దీంతో ఫోన్ మరింత వేడెక్కి బ్యాటరీ దెబ్బతినడం, కొన్ని సందర్భాల్లో అగ్నిప్రమాదాలకు కూడా కారణం కావచ్చు. అందుకే ఫోన్‌ను ఎప్పుడూ దిండు కింద ఉంచకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
అవన్నీ పెద్ద శత్రువులే!
ఇక ఫోన్ నోటిఫికేషన్లు కూడా నిద్రకు పెద్ద శత్రువులే. రాత్రి సమయంలో మెసేజ్‌లు, కాల్స్ లేదా సోషల్ మీడియా అలర్ట్‌లు రావడం వల్ల నిద్ర మధ్యలో భంగం కలుగుతుంది. కొందరు అర్ధరాత్రి మేల్కొని మళ్లీ ఫోన్ చెక్ చేయడం వల్ల నిద్ర చక్రం పూర్తిగా దెబ్బతింటుంది. దీని ప్రభావం మరుసటి రోజు పనితీరుపై కూడా పడుతుంది.మొబైల్ ఫోన్లు నెట్‌వర్క్ కోసం నిరంతరం రేడియో తరంగాలను పంపుతుంటాయి. వాటి ప్రభావంపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నప్పటికీ, జాగ్రత్త చర్యగా ఫోన్‌ను తలకు దూరంగా ఉంచడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.అందుకే నిద్రపోయేటప్పుడు మొబైల్‌ను కనీసం మూడు నుంచి నాలుగు అడుగుల దూరంలో ఉంచండి. అవసరమైతే ఫ్లైట్ మోడ్ ఆన్ చేయండి. పడుకునే గంట ముందు ఫోన్ వినియోగాన్ని తగ్గిస్తే మంచి నిద్రతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.