తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం. మంగళవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌లను కలిసిన ఆయన ఐదు పేజీల రాజీనామా లేఖను అందజేసినట్లు తెలుస్తోంది.
త్వరలో కొత్తపార్టీ పెడతారా?
అన్నామలై వచ్చే ఆరు నుంచి ఎనిమిది నెలల్లో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించే ఆలోచనలో ఉన్నారని ఆయనకు సన్నిహితులు చెబుతున్నారు. తమిళ ప్రజల ప్రయోజనాలను ముందుంచేలా, అదే సమయంలో జాతీయ దృక్పథాన్ని కలిపి కొత్త ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. రాజకీయ పార్టీకి ముందు ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించే అవకాశమూ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
అమిత్ షా ఫోకస్
ఇదిలా ఉండగా, అన్నామలై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసినట్లు తెలుస్తోంది. బీజేపీని వీడాలనుకున్న కారణాలను ఆయనకు వివరించినట్లు సమాచారం. అయితే అన్నామలై పార్టీని వీడకుండా కొనసాగాలని అమిత్ షా కోరుతున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్‌ను ఢిల్లీకి పిలిపించినట్లు తెలుస్తోంది. ఆయనతో చర్చించిన తర్వాత అన్నామలైతో మరోసారి మాట్లాడే అవకాశం ఉందని సమాచారం.
బీజేపీని వదేలేసేందుకు కారణాలు అవే!
అన్నామలై అసంతృప్తికి ప్రధాన కారణంగా ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలే చెబుతున్నారు. ముఖ్యంగా తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడాన్ని ఆయన వ్యతిరేకించినట్లు అనుచరులు పేర్కొంటున్నారు. బీజేపీ ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన పార్టీ నాయకత్వానికి పలుమార్లు సూచించినప్పటికీ, అధిష్ఠానం పొత్తు వైపే మొగ్గు చూపిందని చెబుతున్నారు.
పుట్టిన రోజునే కీలక ప్రకటన!
ఇక కొత్త పార్టీ ఏర్పాటుపై ఈ నెల 4న, తన పుట్టినరోజు సందర్భంగా అన్నామలై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించి, మద్దతుదారుల అభిప్రాయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేయనున్నట్లు తెలుస్తోంది. కొత్త పార్టీకి “మక్కల్ సేవై కట్చి” (ప్రజా సేవ పార్టీ) అనే పేరుతో పాటు మరికొన్ని పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ అంశంపై ప్రముఖ నటుడు రజనీకాంత్ తో కూడా అన్నామలై చర్చించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.