-
హైకోర్టు రద్దు ఆదేశాలతో స్థానికుల్లో ఆందోళన.!
క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న కర్మన్ఘాట్ – నంది హిల్స్ భూ వివాదంపై హైకోర్టు తీర్పు సంచలనం సృష్టిస్తోంది. ఈ తీర్పు పట్ల స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దశాబ్ధ కాలం నుంచి ఈ భూ ముల్లో నివాసం ఉంటున్న సామాన్యులకు షాక్ ఇచ్చేలా గతంలో మంజూరైన ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్లను(OC) తాజాగా హైకోర్టు రద్దు చేసింది.
ఇప్పుడు తెలంగాణలో ఈ వ్యవహారం పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. గత కొన్నేళ్లుగా కర్మన్ఘాట్ – నంది హిల్స్ భూముల్లో ఎంతో మంది నివాసం ఉంటున్నారు. అయితే, తాజాగా హైకోర్టు గతంలో ఈ భూములకు మంజూరు చేసిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను(OC) రద్దు చేసింది. ఈ నిర్ణయం వల్ల ఆయా భూముల్లో నివాసం ఉంటున్న ఎంతో మంది లబ్ధిదారులకు తీవ్ర నష్టం చేకూరనుంది.
తాజాగా హైకోర్టు ఆదేశాలతో ఆయా సర్వే నెంబర్లలో కొత్త రిజిస్ర్టేషన్లు చేయకూడదు. అలాగే, కొత్త నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. దీనిపై దశాబ్దాలుగా నివాసం ఉంటున్న స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి ఇళ్ల భవిష్యత్ ప్రశార్థకంగా మారడంతో ఏం చేయాలో తెలియక లబోదిబోమంటున్నారు. భూముల యాజమాన్య హక్కులపై స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల రద్దు కారణం ఇదే..
నంది హిల్స్ భూములకు సంబంధించి 2004లో రిట్ పిటిషన్ దాఖలైంది. దీనిపై ఈ ఏడాది ఫిబ్రవరి ఆరో తేదీన హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. మరణించిన వ్యక్తుల వారి చట్టబద్ధ వారసులను పార్టీ చేయకుండా విచారణ చేశారంటూ కోర్టు వ్యాఖ్యానించడంతోపాటు.. కోర్టు ఆదేశించిన అసలు రెవెన్యూ రికార్డులను సమర్పించడంలో అధికారులు విఫలమయ్యారని న్యాయస్థానం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
01-11-1973 నాటికి ఇనాం భూముల ఎవరి స్వాధీనంలో ఉన్నాయో నిర్ధారించకుండానే గతంలో ఓఆర్సీలు మంజూరు చేశారన్న కోర్టు.. అందుకే ఆ సర్టిఫికెట్లు చెల్లవని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో 1970వ దశకం నాటి ల్యాండ్ రిఫార్మ్ ట్రిబ్యునల్ రికార్డులు ఇప్పడుకీలకంగా మారాయి. రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రీఫార్మ్ ట్రిబ్యునల్ రికార్డుల ప్రకారం (సీసీ నెం ఈ /2476, 2477, 2478/1975), కర్మన్ఘాట్ గ్రామంలోని సర్వే నెంబర్ 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 30ల పరిధిలోని భూములపైనే ఇప్పుడు హైకోర్టు ఆదేశాల ప్రకారం కొత్త విచారణ జరగాల్సి ఉంది.
కోర్టు తీర్పు నేపథ్యంలో కందుకూరు డివిజన్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ జగదీష్ రెడ్డి, సరూర్ నగర్, బాలాపూర్ మండలాల తహసీల్దార్లకు లేఖ ద్వారా కీలక ఆదేశాలను జారీ చేశారు. ఆరు నెలల్లో విచారణ పూర్తి చేసి ఇనాందార్, వారసులకు, ఇతర ప్రైవేటు భాగస్వాములకు నోటీసులు ఇవ్వాలని, ఆరు నెలల వ్యవధిలో విచారణ ముగించాలని కోర్టు స్పష్టం చేసింది. అప్పటి వరకు రిజిస్ర్టేషన్లు చేయవద్దని స్పష్టం చేసింది. నిర్మాణ అనుమతులు కూడా ఇవ్వవద్దని తేల్చి చెప్పింది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాల మేరకు చర్యలు చపట్టనున్నట్టు అధికారులు చెబుతున్నారు.
స్థానికుల్లో తీవ్ర ఆందోళన..
కొన్నేళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్న స్థానికుల్లో హైకోర్టు తీర్పుతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎప్పుడో వేసిన లే అవుట్లలో ప్లాట్లు కొని, కష్టపడి ఇళ్లు కట్టుకున్నామని, మున్సిపల్ పన్నులు కూడా కడుతున్నామని చెబుతున్నారు. అటువంటి భూములపై హైకోర్టు తాజాగా ఆదేశాలను ఇవ్వడం పట్ల వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో తాము ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లు ఉంటాయో, ఉండవోనన్న ఆవేదనను పలువురు వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల తప్పులకో, దశబ్ధాల నాటి యాజమాన్య వివాదాలతో ఇప్పుడు అక్కడ నివసిస్తున్న అమాయక ప్రజలను బలి చేయడం ఎంత వరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి, సామాన్యుల ఇళ్లకు, వారి హక్కులకు భంగం వాటిళ్లకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. కబ్జాలు చేసిన వారిపై ఉక్కుపాదం మోపాలని, కష్టపడి కొనుగోలు చేసిన వారికి న్యాయం చేయాలని విన్నవించుకుంటున్నారు. మరి దీనిపై కోర్టు, అధికారులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.