హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అజిత్ తల్లి మోహిని మణి వయోసహజ అనారోగ్యంతో చెన్నైలో కన్నుమూశారు. ఈ వార్తతో తమిళ సినీ, రాజకీయ వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. తల్లి మరణవార్త తెలిసిన వెంటనే దుబాయ్‌లో ఉన్న అజిత్ హుటాహుటిన చెన్నై చేరుకున్నారు.
ఈ కష్టసమయంలో అజిత్ కుటుంబాన్ని పరామర్శించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా ఆయన నివాసానికి వెళ్లారు. ఆయనతో పాటు స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ కూడా అజిత్ ఇంటికి చేరుకుని మోహిని మణి భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం అజిత్‌ను, ఆయన కుటుంబ సభ్యులను ఆత్మీయంగా ఓదార్చారు.
అజిత్ తల్లి మరణంపై సీఎం విజయ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. నా స్నేహితుడు అజిత్ కుమార్ తల్లి మరణ వార్త కలచివేసిందని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. అలాగే ఈ బాధాకర సమయంలో అజిత్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అయితే ఈ పరామర్శలో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం విజయ్, త్రిష కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత త్రిషతో కలిసి విజయ్ బహిరంగంగా కనిపించడం ఇదే తొలిసారి కావడంతో ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. విజయ్, త్రిష ఇద్దరూ కలిసి అజిత్ ఇంటికి చేరుకుని పరామర్శించడం అభిమానుల్లోనూ చర్చనీయాంశమైంది. ఒకవైపు అజిత్ కుటుంబానికి ధైర్యం చెప్పడం.. మరోవైపు ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమిళనాట ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది.