•పార్టీని విస్తృతం చేసేందుకు పవన్ కళ్యాణ్ నిర్ణయం
•ఇటీవల జరిగిన పరిణామాలతో కసిగా జనసైనికులు
•రేపు హైదరాబాదులో విస్తృతస్థాయి సమావేశం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:-
తెలంగాణలో జనసేన బలోపేతం పై ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్. జూన్ లో భారీ యాక్షన్ ప్లాన్ రూపొందించారు. హైదరాబాదులో భారీ బహిరంగ సభకు ప్రణాళిక రచిస్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ పై తెలంగాణ ముసుగులో కొందరు జర్నలిస్టులు, మేధావులు వ్యక్తిగత దూషణలకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా జన సైనికులు ఏకతాటి పైకి వచ్చారు. పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసిన హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నుంచి గట్టి సందేశం ఇచ్చారు. తెలంగాణ సమాజానికి పవన్ కళ్యాణ్ ఎంతో ప్రయోజనం చేకూర్చాలని.. అటువంటి వ్యక్తి పై వ్యక్తిగత దూషణలకు దిగితే సహించేది లేదు అని హెచ్చరించారు.
కార్పొరేషన్ ఎన్నికలే టార్గెట్
త్వరలో గ్రేటర్ హైదరాబాద్ తో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ లకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేయాలని పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జూన్ 2న హైదరాబాద్లో జనసేన నేతలతో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకు సంబంధించి సన్నాహాలు కూడా ప్రారంభం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలకు సమాచారం కూడా అందించారు. ఇప్పటికే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడ్ తో జనసైనికులు యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు పార్టీ అధినేత దిశా నిర్దేశం చేయనుండడంతో యాక్షన్ ప్లాన్ రూపొందించనున్నారు.
ఒంటరి పోరాటానికి మొగ్గు..
గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరి పోరాటానికి పవన్ కళ్యాణ్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో జనసేన ఒంటరి పోరాటం చేసి రెండు చోట్ల విజయం సాధించింది. అంతకుముందు సర్పంచి ఎన్నికల్లో సైతం సత్తా చాటింది. కనీసం స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సన్నాహాలు చేయలేదు. ఆ పార్టీ సైతం తెలంగాణలో పెద్దగా యాక్టివ్గా లేదు. సోషల్ మీడియాలో మాత్రం ఆ పార్టీ శ్రేణులు యాక్టివ్ గా ఉండేవారు. కానీ ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడ్, తరువాత పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా తెలంగాణలో జరుగుతున్న రాజకీయ కుట్ర.. తదితర కారణాలతో.. తెలంగాణలో బలపడాలన్న నిర్ణయానికి వచ్చారు. ముందుగా కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటి.. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఉండే పరిస్థితికి అనుగుణంగా ఒక నిర్ణయం తీసుకోనున్నారు.