Homeరాజకీయంమమత అల్లుడిపై దాడి.. తీవ్రంగా స్పందించిన మాజీ సీఎం

మమత అల్లుడిపై దాడి.. తీవ్రంగా స్పందించిన మాజీ సీఎం

క్రైమ్ మిర్రర్, పాలిటిక్స్ :- పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓటమి తరువాత ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉన్న సమయంలో తృణమూల్‌ నాయకులు, కార్యకర్తలు చేసిన దాడులు, పెట్టిన ఇబ్బందులతో బాధితులుగా ఉన్న ఎంతో మంది ఇప్పుడు ప్రతి దాడులకు దిగుతుండడంతో రాష్ట్రంలోని అనేక చోట్ల ఆ పార్టీ నాయకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, ఆ పార్టీ ముఖ్య నాయకుడు, ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన అభిషేక్‌ బెనర్జీపై పలువురు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఎన్నికల సమయంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో బాధితులను పరామర్శించేందుకు సోనార్‌పూర్‌ అభిషేక్‌ వెళ్లారు. అక్కడ స్థానికులు రాళ్లు, కోడిగుడ్లు, చెప్పులను ఆయనపై విసిరారు. కొందరు ఆయనపై చేయి కూడా చేసుకున్నారు. దొంగ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో హెల్మెట్‌ ధరించిన అభిషేక్‌కు భద్రతా సిబ్బంది రక్షణగా నిలిచి పక్కకు తీసుకుని వెళ్లిపోయారు. దీనిపై తీవ్రంగానే స్పందించిన అభిషేక్‌ బెనర్జీ.. దాడి సమయంలో పోలీసులు ఎక్కడా లేరని, తనపై జరిగిన దాడిపై న్యాయం పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే తనపై దాడి జరిగిందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

తీవ్రంగా స్పందించిన మమత.. సిగ్గుచేటంటూ వ్యాఖ్య..

ఈ ఘటనపై మాజీ సీఎం మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో స్పందించారు. పాలకులు హంతకులుగా మారుతున్నారని, బీజేపీకి ఇది సిగ్గు చేటంటూ ఆమె వాఖ్యానించారు. ఈ మేరకు ఆమె ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో బాధితుడైన సంజూ కర్మాకర్‌ కుటుంబాన్ని పరామర్శిస్తానని గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి అభిషేక్‌ వెళ్లారని, సోనార్‌పూర్‌ వెళ్లిన తరువాత బీజేపీ దన్నుతో కొందరు దుండగులు తమ జాతీయ ప్రధాన కార్యదర్శిపై అమానుషంగా దాడి చేసినట్టు మమత పోస్టులో పేర్కొన్నారు. అయినప్పటికీ ఆయన బీజేపీ గూండాల దాడిలో నష్టపోయిన కుటుంబానికి అండగా నిలిచారని పేర్కొన్నారు. కనికరంతో కూడిన రాజకీయాలకు, విద్వేషంతో కూడిన రాజకీయాలకు ఇదే తేడా అని స్పష్టం చేసిన మమత.. సువేందు హయంలో చోటుచేసుకుంటున్న బెదిరింపులకు, హింస, ప్రతీకార రాజకీయాలు మరోసారి ఇవాళ బహిర్గతమయ్యాయంటూ ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ కూడా స్పందించింది. ఈ తరహా దాడులు సమంజసం కాదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే పేర్కొన్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు