Crime Mirror Karnataka: కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న డీకే శివకుమార్ తన కొత్త టీమును సిద్ధం చేసుకుంటున్నారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డీకే శివకుమార్కు ఈ బాధ్యతలను అప్పగిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా రెండేళ్లపాటు కర్ణాటక అసెంబ్లీ పదవీకాలం ఉంది.
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం కీలక మార్పులను చేసింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టనున్న డీకే శివకుమార్ సరికొత్త టీంతో సిద్ధమవుతున్నారు. జూన్ మూడో తేదీన ముఖ్యమంత్రిగా శివకుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం శివకుమార్ కు లైన్ క్లియర్ చేసింది. దీంతో ఆయన తన టీమును సిద్ధం చేసుకునే పనిలోనూ నిమగ్నమయ్యారు.
ముఖ్యంగా యంగ్ టీమ్ ను ఆయన మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. 50 ఏళ్లలోపు ఉన్న వారికి తన జట్టులో చోటు ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మంత్రులుగా ఉన్న సీనియర్లకు పార్టీ బాధ్యతలను అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనికి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంగీకరించినట్లు చెబుతున్నారు.
మూడో తేదీన బాధ్యతలను చేపట్టనున్న డీకే శివకుమార్ తాజాగా గవర్నర్ తో సమావేశం అయ్యారు. తన ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వాలని కోరేందుకు ఆయన గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ తో సమావేశం అయ్యారు. ఆయన సోదరుడితో కలిసి లోక్ భవనకు వెళ్లి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. సుమారు అర్థగంట పాటు ఈ చర్చలు జరిగాయి.
శివకుమార్ టీమ్ లో 50 శాతం కొత్త ముఖాలకు ఛాన్స్..
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న శివకుమార్ పూర్తిగా కొత్త టీమ్ తో బరిలోకి దిగబోతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనకు లైన్ క్లియర్ చేసింది. ప్రభుత్వంపై పూర్తిగా తన పట్టును పెంచుకునేలా ఈ టీం ఉండనుంది. శివ కుమార్ తోపాటు పది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.
దాదాపు 50% కొత్త ముఖాలకు అవకాశం కల్పించాలన్న అధిష్టానం సూచనల మేరకు డీకే శివకుమార్ తన టీమును సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు. మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నవారిలో దళితులు, ఎస్టి, బీసీ, లింగాయత్ సామాజిక వర్గాలకు చెందిన వాళ్లు ఉన్నారు. అలాగే నలుగురికి ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించనున్నారు.
ఈ నిర్ణయానికి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మంత్రి పదవులు దక్కించుకోబోతున్న వారిలో సిద్ధరామయ్య కుమారుడు ఎమ్మెల్సీ యతేంద్ర కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న హెచ్సీ మహదేవప్ప, జి పరమేశ్వర, కేజే జార్జ్ వంటి సీనియర్లను తప్పించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతోనే డీకే శివకుమార్ కు బాధ్యతలను అప్పగించింది. 2028లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశంతో పార్టీకి విధేయుడుగా ఉంటూ వస్తున్న డీకే శివకుమార్ కు ఈ బాధ్యతలను అధిష్టానం అప్పగించింది.
శివకుమార్ పార్టీలో తన పట్టును నిలుపుకోవడంతోపాటు ప్రజల్లో కూడా మంచి పేరును తెచ్చుకోవడం ద్వారా ప్రభుత్వాన్ని మరోసారి ఏర్పాటు చేసే లక్ష్యంతో పని చేయాల్సి ఉంటుంది. అయితే గడిచిన నాలుగు దశాబ్దాలుగా రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు కావడం ఇప్పటి వరకు కర్ణాటకలో ఏ ప్రభుత్వానికి సాధ్యపడలేదు. అటువంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసే లక్ష్యాన్ని డీకే శివకుమార్ ముందు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంచింది. మరి డీకే శివకుమార్ ఈ సవాల్ ను ఎదుర్కొంటూ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారా.? లేదా.? అన్నది చూడాల్సి ఉంది.