-
భార్య అలేఖ్య రెడ్డి తో పాటు..
-
తెలంగాణ సీఎంతో వేదిక పంచుకున్న వైనం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : మంచు మనోజ్ పూర్తిస్థాయి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా? రాజకీయాల్లో క్రియాశీలకం అవుతారా? వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచి పోటీ చేస్తారా? పొలిటికల్ వర్గాల్లో దీనిపైనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. కొద్ది రోజుల కిందట తన భార్య అలేఖ్య రెడ్డి పొలిటికల్ ఎంట్రీ పై స్పష్టతనిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆమె ఏపీ నుంచి పోటీ చేయడం ఖాయమని చెప్పుకొచ్చారు. అయితే హైదరాబాదులో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్నారు మనోజ్. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో సైతం మనోజ్ ప్రవేశిస్తారా అనే టాక్ వినిపిస్తోంది.
-
గతంలో టిడిపిలో మోహన్ బాబు..
మంచు కుటుంబానికి రాజకీయాలు కొత్త కాదు. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగారు మోహన్ బాబు. ఆ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడు కూడా అయ్యారు. నందమూరి తారక రామారావుకు అత్యంత ఆప్తుడు కూడా. అయితే తరువాత చంద్రబాబుతో వచ్చిన విభేదాలతో తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పెద్దగా గుర్తించలేదు. దీంతో తెలుగుదేశం పార్టీకి అనుకూల ప్రకటనలు చేస్తూ వచ్చారు. అన్నింటికీ మించి మంచు కుటుంబంలో వివాదాలు చోటు చేసుకున్నాయి. రెండో కుమారుడు మంచు మనోజ్ మోహన్ బాబుతో విభేదించడంతో అనేక రకాల పరిణామాలు జరిగాయి. అయితే ఇప్పుడిప్పుడే ఆ వివాదాలు సద్దుమణిగినట్లు కనిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో మంచు మనోజ్ పొలిటికల్ గా ఆసక్తికర ప్రకటనలు చేస్తుండడం విశేషం.
-
వచ్చే ఎన్నికల్లో అలేఖ్య రెడ్డి పోటీ..
మంచు మనోజ్ రాయలసీమలోని ప్రముఖ నేత భూమా నాగిరెడ్డి, శోభ నాగిరెడ్డి కుమార్తె అలేఖ్య రెడ్డిని వివాహం చేసుకున్నారు. రాజకీయంగా మంచి నేపథ్యం ఉన్న కుటుంబం అది. ఇప్పటికే భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రియా రెడ్డి ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ కుటుంబానికి నంద్యాలలో సైతం మంచి పట్టు ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో అలేఖ్య రెడ్డి పోటీ ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగింది. దానిపై మనోజ్ కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే అలేఖ్య రెడ్డి పోటీపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఆమె ఏ పార్టీ నుంచి.. ఏ నియోజకవర్గంలో నుంచి పోటీ చేస్తారు అనేదానిపై స్పష్టత రాలేదు. మరోవైపు కాంగ్రెస్ సీఎం రేవంత్ తో మంచు మనోజ్ వేదిక పంచుకున్నారు. మరోసారి పొలిటికల్ గా హైలెట్ అయ్యారు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో సరైన గుర్తింపు దక్కించుకుంటున్నారు మనోజ్. ఆయనకు రాజకీయ ఆసక్తి ఉన్నట్లు అర్థం అవుతుంది. అయితే ముందుగా తన భార్యను పొలిటికల్ గా ఎంట్రీ ఇప్పించి.. తర్వాత మంచు మనోజ్ సైతం రాజకీయాల్లోకి ప్రవేశించే ఛాన్స్ కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.