HomeజాతీయంKarnataka Politics: ముచ్చటగా ముగ్గురే.. కర్ణాటకలో పూర్తి కాలం సీఎంగా కొనసాగిన నేతలు ఎవరంటే?

Karnataka Politics: ముచ్చటగా ముగ్గురే.. కర్ణాటకలో పూర్తి కాలం సీఎంగా కొనసాగిన నేతలు ఎవరంటే?

కర్ణాటక రాజకీయాల్లో మరోసారి కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేసినట్టు సమాచారం. ఆయన స్థానంలో డీకే శివకుమార్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీకే శివకుమార్ సీఎం అయితే ఆయన పదవీకాలం రెండేళ్లపాటు మాత్రమే ఉండొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఐదేళ్ల పదవీకాలం అత్యంత అరుదు!

కర్ణాటక రాజకీయ చరిత్రను పరిశీలిస్తే.. ముఖ్యమంత్రులు పూర్తి ఐదేళ్ల పదవీకాలం కొనసాగించడం చాలా అరుదుగా కనిపిస్తుంది. 1956లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం ముగ్గురు నాయకులు మాత్రమే సీఎంగా పూర్తి కాలం పనిచేశారు.

పూర్తికాలం సీఎంగా పని చేసిన నేతలు ఎవరంటే?

కాంగ్రెస్‌కు చెందిన ప్రముఖ నేత ఎస్. నిజలింగప్ప రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1956లో మొదటిసారి సీఎం అయిన ఆయన ఏడాది పాటు ఆ పదవిలో కొనసాగారు. ఆ తరువాత 1962లో మళ్లీ సీఎం అయ్యి దాదాపు ఆరు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగారు. అలాగే, కాంగ్రెస్‌కు చెందిన మరో సీనియర్ నేత దేవరాజ్ ఉర్స్ 1972 నుంచి 1977 వరకు పూర్తికాలం సీఎంగా కొనసాగారు. తరువాత 2013లో తొలిసారి ముఖ్యమంత్రి అయిన సిద్ధరామయ్య కూడా ఐదేళ్ల పూర్తి కాలం పదవిలో ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందారు.

తక్కువ కాలం సీఎంగా పని చేసిన నేతల లిస్ట్ పెద్దదే!

ఇక తక్కువ కాలం సీఎంగా పనిచేసిన నాయకుల జాబితా కూడా కర్ణాటకలో పెద్దదిగానే ఉంది. బీజేపీ నేత యడియూరప్ప 2007లో సీఎం అయినా, బీజేపీ-జేడీఎస్ కూటమి విభేదాల కారణంగా కేవలం వారం రోజుల్లోనే పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 1971లో సీఎం అయిన ఎస్ఆర్ కాంతి కూడా కొన్ని వారాలపాటు మాత్రమే ఆ పదవిలో కొనసాగారు. కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి నాయకత్వం వహించిన ధరమ్ సింగ్ సుమారు ఏడాదికిపైగా సీఎం పదవిలో ఉండి 2006లో తప్పుకున్నారు. అలాగే 2012లో ముఖ్యమంత్రి అయిన జగదీశ్ శెట్టర్ దాదాపు 305 రోజుల పాటు మాత్రమే పదవిలో కొనసాగారు. అప్పటి రాజకీయ పరిణామాలు, పార్టీ అంతర్గత మార్పుల కారణంగా ఆయనకు అవకాశం లభించింది. కానీ, అసెంబ్లీ గడువు ముగియడంతో ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితులను చూస్తే కర్ణాటకలో రాజకీయ స్థిరత్వం తరచుగా సవాళ్లను ఎదుర్కొంటూ వస్తోందని చెప్పొచ్చు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు