అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత ప్రధాని నరేంద్ర మోదీపైపై ప్రశంసలు కురిపించారు. మోదీ తనకు ఎంతో సన్నిహిత మిత్రుడని, ఆయనపై తనకు ప్రత్యేక అభిమానం ఉందని ట్రంప్ అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఫోన్ కాల్ ద్వారా లైవ్ లో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.
అకస్మాత్తుగా వీడియో కాల్ లోకి వచ్చిన ట్రంప్!
అమెరికా ఈ ఏడాది తన 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించుకోనున్న నేపథ్యంలో, భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆధ్వర్యంలో ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అనూహ్యంగా ట్రంప్ ఫోన్ ద్వారా మాట్లాడటం అక్కడ ఉన్న వారిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇంతకీ ట్రంప్ ఏమన్నారంటే?
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, “ప్రధాని మోదీ గొప్ప నాయకుడు. ఆయన నాకు మంచి స్నేహితుడు. గతంతో పోలిస్తే ఇప్పుడు భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడ్డాయి. భారత్ మమ్మల్ని పూర్తిగా నమ్మవచ్చు” అని చెప్పారు. ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎంతో బలంగా ఉందని, భారత్కు ఏ సహాయం అవసరమైనా అమెరికా అండగా ఉంటుందని తెలిపారు. “భారత్కు ఏది అవసరమైనా అది అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉంది. రెండు దేశాల మధ్య స్నేహం మరింత బలపడుతోంది” అని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ, దౌత్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అదే సమయంలో మార్కో రుబియో పనితీరును కూడా ట్రంప్ ప్రశంసించారు. అమెరికా చరిత్రలోనే రుబియో అత్యుత్తమ విదేశాంగ మంత్రుల్లో ఒకరని కొనియాడారు. భారత్ పర్యటనలో రుబియో కీలక చర్చలు జరుపుతున్నారని తెలిపారు.
President Trump called me tonight. He had a clear message: “𝐈 𝐥𝐨𝐯𝐞 𝐏𝐫𝐢𝐦𝐞 𝐌𝐢𝐧𝐢𝐬𝐭𝐞𝐫 𝐌𝐨𝐝𝐢. 𝐖𝐞’𝐯𝐞 𝐧𝐞𝐯𝐞𝐫 𝐛𝐞𝐞𝐧 𝐜𝐥𝐨𝐬𝐞𝐫 𝐭𝐨 𝐈𝐧𝐝𝐢𝐚. 𝐈’𝐦 𝐚 𝐛𝐢𝐠, 𝐛𝐢𝐠 𝐟𝐚𝐧 𝐨𝐟 𝐏𝐫𝐢𝐦𝐞 𝐌𝐢𝐧𝐢𝐬𝐭𝐞𝐫 𝐌𝐨𝐝𝐢…” pic.twitter.com/jJBLhKdZhL
— Ambassador Sergio Gor (@USAmbIndia) May 24, 2026
మరోవైపు భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారు కావచ్చని మార్కో రుబియో వెల్లడించారు. ఈ ఒప్పందం వల్ల రెండు దేశాలకు ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యం మరింత పెరిగే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు భారత్-అమెరికా సంబంధాలకు మరింత ప్రాధాన్యత తీసుకొచ్చాయని విశ్లేషకులు భావిస్తున్నారు.