హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: తమిళనాడులో అధికారాన్ని చేపట్టిన విజయ్ తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు. పరిపాలనలో విభిన్నత చూపిస్తూ తన మార్కు చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తప్పు చేసే అధికారులపై వెంటనే యాక్షన్ తీసుకుంటూ ప్రజలకు తమ ప్రభుత్వంపై నమ్మకాన్ని కల్పించే ప్రయత్నాన్ని ఆయన చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా ముగ్గురు ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకున్న వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అత్యాచార బాధిత బాలిక గురించి వివరాలు వెల్లడించేందుకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ముగ్గురు ఐపీఎస్ అధికారులు జోకులు వేసుకుంటూ నవ్వులు సాగించిన విషయాన్ని సీఎం విజయ్ సీరియస్ గా తీసుకున్నారు. కేసు తీవ్రతను అర్థం చేసుకోకుండా వ్యవహరించిన అధికారులపై యాక్షన్ తీసుకున్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగు వైరల్ అవుతోంది.
పదేళ్ల బాలికపై అత్యాచారం…
తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలో ఓ పదేళ్ల బాలికను కొందరు వ్యక్తులు అపహరించి అత్యంత క్రూరానికి పాల్పడ్డారు. ఈ సంఘటన తమిళనాడులోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి విజయ్ వెంటనే స్పందించి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి సంబంధిత ఎమ్మెల్యే పంపించి పరామర్శించేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై వేగంగా దర్యాప్తు చేయాలని అధికారులు ఆయన ఆదేశించారు. సీఎం విజయ్ ఆదేశాలతో వేగంగా స్పందించిన పోలీసులు ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన విషయాలను చెప్పడానికి ఒక మహిళ ఐజీ అధికారి, ఇద్దరు ఐపీఎస్ అధికారులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ వివరాలను వెల్లడించడానికి సిద్ధమవుతున్న సమయంలో ఆ ముగ్గురు అధికారులు నవ్వులు చిందిస్తూ కనిపించారు. ముఖ్యంగా మహిళ ఐజీ అధికారి అయితే తోటి ఐపీఎస్ అధికారులతో సరదాగా నవ్వుతూ ముచ్చటించారు. గోర్లు గిల్లుతూ.. ఈ సంఘటనపై అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
తీవ్రస్థాయిలో సోషల్ మీడియాలో విమర్శలు…
ఆ మహిళ ఐజీ అధికారి వ్యవహరించిన తీరు పట్ల సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు వచ్చాయి. ఒక బాలిక చనిపోతే కొంచెం కూడా మానవత్వం లేదా అంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నువ్వు కూడా ఒక మహిళవే కదా, నీక్కూడా పెళ్లయి ఉంటుంది కదా, నీకు పిల్లలు ఉండి ఉంటారు కదా, ఒకవేళ జరిగిన ఘటనలో చనిపోయింది నీ కూతురైతే నువ్వు ఇలానే వ్యవహరిస్తావా.? అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఇది కాస్త ముఖ్యమంత్రి విజయ్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు మీడియా సమావేశానికి వచ్చిన ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒక కేసు వ్యవహారంలో పోలీసులు నిజాలు చెప్పేటప్పుడు ఇలా వ్యవహరించకూడదని సూచించారు.
ప్రజలకు పోలీసులు జవాబుదారీగా ఉండాలని, శాంతి భద్రతలను పరిరక్షించాలని సూచించారు. దారుణంగా వ్యవహరించే అధికారుల మీద ఏమాత్రం జాలి చూపించాల్సిన అవసరం లేదని విజయ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. జరిగిన ఘటనపై తాను విచారం వ్యక్తం చేస్తున్నానని, పోలీసులు ఇకపై ఇలా వ్యవహరించకూడదని ఆయన సూచించారు. అందువల్లే ఆ ముగ్గురు అధికారులపై సస్పెండ్ వేటు వేస్తున్నట్టు వెల్లడించారు. విజయ్ తీసుకున్న నిర్ణయం పట్ల దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. ముఖ్యమంత్రి విజయను చూసి మిగతా ముఖ్యమంత్రులు నేర్చుకోవాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. ప్రస్తుతం ఐపిఎస్ అధికారులపై తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.