జంతువులు, పక్షులను కుటుంబ సభ్యుల్లా చూసుకునే వారు చాలా మంది ఉంటారు. ప్రేమ, అనుబంధం, ఆప్యాయతతో పెంచే పెంపుడు జంతువులు కాలక్రమంలో ఆ ఇంట్లో విడదీయలేని భాగంగా మారిపోతాయి. సాధారణంగా కుక్కలు, పిల్లులు, పక్షులు పెంచడం ఎక్కువగా కనిపిస్తుంటే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం ఒక కుటుంబం నాటు కోడిపుంజును ఏకంగా 16 ఏళ్లుగా పెంచుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ కోడిపుంజును కేవలం పెంపుడు జంతువుగా కాకుండా కుటుంబ సభ్యురాలిగానే భావిస్తూ ప్రత్యేకంగా చూసుకుంటున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో నివసిస్తున్న చెన్ను ప్రవీణ్, శైలజ దంపతులు తమ ఇంట్లో టింకూ అనే నాటు కోడిపుంజును ఎంతో ప్రేమగా పెంచుతున్నారు. సాధారణంగా కోడిపుంజుల జీవనకాలం 5 నుంచి 10 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తారు. అయితే ఈ కుటుంబం వద్ద ఉన్న టింకూ ఇప్పటికే 16 ఏళ్ల వయసుకు చేరుకోవడం విశేషంగా మారింది. దీంతో స్థానికంగా ఈ కోడిపుంజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా యజమాని ప్రవీణ్ మాట్లాడుతూ.. తన కుమార్తెకు 2 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి టింకూను పెంచుతున్నామని తెలిపారు. కాలక్రమేణా అది ఇంట్లో అందరితో కలిసిపోయి కుటుంబ సభ్యురాలిలా మారిపోయిందన్నారు. అంతేకాకుండా గత 2 సంవత్సరాలుగా లియో అనే జాతి కుక్కను కూడా పెంచుతున్నామని, ఈ రెండు జీవులు ఇంట్లో కలిసి తిరుగుతూ స్నేహంగా గడుపుతాయని వివరించారు. ముఖ్యంగా ఎండాకాలంలో కూలర్ కింద కలిసి పడుకోవడం, ఆడుకోవడం తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు.
ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. టింకూ ఇప్పటికీ ప్రత్యేకంగా సజ్జలు మాత్రమే ఆహారంగా తీసుకుంటుందని తెలిపారు. ఇన్ని సంవత్సరాలు తమతో కలిసి జీవించిన ఈ కోడిపుంజు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నామని, ఇక ముందు ఇంకా ఎంతకాలం తమతో ఉంటుందో తెలియక కొంత భావోద్వేగానికి గురవుతున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా, సరైన పోషకాహారం, నాణ్యమైన సంరక్షణ, అనుకూల వాతావరణం ఉంటే కోడిపుంజులు 15 సంవత్సరాలకు పైగా జీవించే అవకాశాలు కూడా ఉంటాయని జిల్లా పశువైద్య శాఖ అధికారులు వెల్లడించారు.
జంతువులపై ప్రేమ అనేది కేవలం సంరక్షణకే పరిమితం కాదని, వాటిని కుటుంబ సభ్యుల్లా ఆదరిస్తే అవి కూడా మనుషులతో అనుబంధాన్ని పెంచుకుంటాయని ఈ కుటుంబం నిరూపిస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ALSO READ: భార్య కాపురానికి రావడం లేదని అత్తారింటికి వెళ్లి దారుణానికి పాల్పడ్డ భర్త