-
ఆళ్లగడ్డ నుంచి బరిలో దిగుతారా.. లేకుంటే నంద్యాల
-
కుటుంబ పోరు తప్పదా
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: కర్నూలు జిల్లా రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. భూమా నాగిరెడ్డి కుమార్తె, మంచు మనోజ్ భార్య మౌనిక రెడ్డి పొలిటికల్ ఎంట్రీ పై కీలక ప్రకటన వచ్చింది. తన భార్య రాజకీయాల్లోకి వస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తారని మనోజ్ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా కర్నూలు జిల్లాలో రాజకీయ ప్రకంపనలు రేగాయి. మౌనిక ఏ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారు? ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అనే దానిపై జోరుగా చర్చలు ప్రారంభం అయ్యాయి. అయితే ఆమె కచ్చితంగా ఆళ్లగడ్డ నుంచి కానీ.. నంద్యాల నుంచి కానీ పోటీ చేస్తారన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో తెగ హల్చల్ చేస్తోంది.
భూమా కుటుంబానికి ప్రత్యేక స్థానం…
ఆళ్లగడ్డ తో పాటు నంద్యాల నియోజకవర్గంలో భూమా కుటుంబానికి ప్రత్యేక స్థానం. సుదీర్ఘకాలం భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ఆ నియోజకవర్గాలను శాసించారు. టిడిపి, కాంగ్రెస్, ప్రజారాజ్యం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తమదైన ముద్ర చాటుకున్నారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు భూమా నాగిరెడ్డి. ఆ ఎన్నికల్లో ఆయన కుమార్తె అఖిలప్రియ సైతం గెలిచారు. కానీ అనుకోని రీతిలో టిడిపి గూటికి వచ్చారు. అయితే ఇంతలో నంద్యాల ఎమ్మెల్యే గా ఉన్న భూమా నాగిరెడ్డి అకాల మరణం చెందారు.
దీంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. అదే కుటుంబానికి చెందిన భూమా బ్రహ్మానందరెడ్డి అక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు టిడిపి అభ్యర్థిగా. 2019 ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి అఖిలప్రియ, నంద్యాల నుంచి బ్రహ్మానంద రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో ఒక కుటుంబానికి ఒక్కటే టిక్కెట్ అన్నట్టు నిబంధన విధించడంతో బ్రహ్మానంద రెడ్డికి అవకాశం దక్కలేదు. అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. నంద్యాల నుంచి మాత్రం టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు ఫరూక్. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు.
తప్పకుండా కూటమి నుంచి…
అయితే ఇప్పుడు మౌనిక రెడ్డి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అనేది తెలియాల్సి ఉంది. అయితే కచ్చితంగా కూటమి తరుపున మాత్రం ఆమె నిలబడతారు. ఇప్పటికే ఆళ్లగడ్డ నుంచి తన సోదరి అఖిలప్రియ ఎమ్మెల్యేగా ఉన్నారు. నంద్యాలలో ఫరూక్ కొనసాగుతున్నారు. అయితే ఆళ్లగడ్డ నుంచి ఆమె పోటీ చేస్తారని ప్రచారం నడుస్తోంది. గత కొంతకాలంగా తన సోదరి అఖిల ప్రియతో ఆమెకు విభేదాలు ఉన్నట్లు కూడా ప్రచారం సాగుతోంది. కానీ అఖిల ప్రియ మాత్రం తమ మధ్య విభేదాలు లేవని చెబుతున్నారు. కానీ ఎన్నికల ముంగిట మాత్రం భూమా వారసురాళ్లు ఇద్దరి మధ్య గట్టిగానే ఫైట్ ఉంటుందని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.