హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: హైదరాబాద్ నగరంలో మరో స్టీల్ బ్రిడ్జి త్వరలోనే అందుబాటులోకి రానుంది. దశాబ్దాల క్రితం ప్రతిపాదించినా.. వాయిదా పడుతూ వస్తున్న ఈ బ్రిడ్జి.. నిర్మాణం పూర్తి చేసుకోగా.. వచ్చే నెల 2వ తేదీన ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. నల్గొండ క్రాస్ రోడ్డు నుంచి.. ఓవైసీ హాస్పిటల్ వరకు నిర్మించిన ఈ స్టీల్ బ్రిడ్జితో ఆ మార్గంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పడనుందని అధికారులు పేర్కొంటున్నారు.శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, స్కైవేలు.. అంతే వేగంగా నిర్మాణం అవుతున్నాయి. విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్‌లో ఉన్న కోట్ల మంది ప్రజల రాకపోకలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేసేందుకు ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు.. మౌలిక వసతులు కల్పిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే గత కొంత కాలంగా ఎన్నో ఫ్లైఓవర్లు నగరంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే ఎన్నో ఏళ్ల క్రితం ప్రతిపాదించిన స్టీల్ బ్రిడ్జి.. ఎట్టకేలకు నిర్మాణ పనులు పూర్తి చేసుకుంటోంది. త్వరలోనే ఆ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకువచ్చి.. నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలను తగ్గించాలని అధికారులు భావిస్తున్నారు.నిత్యం వాహనాల రద్దీతో.. తీవ్ర ట్రాఫిక్ జాం అయ్యే మలక్‌పేట వద్ద నల్గొండ క్రాస్ రోడ్డు నుంచి కంచన్ బాగ్ వద్ద ఉన్న ఓవైసీ హాస్పిటల్ వరకు నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ స్టీల్ బ్రిడ్జిని త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు రెడీ అవుతున్నాయి. మొత్తం 3.32 కిలోమీటర్ల పొడవు, ఆరు
లేన్లుగా నిర్మించిన ఈ స్టీల్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి సుమారు రూ.630 కోట్ల వ్యయం అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ స్టీల్ బ్రిడ్జి.. క్షేత్ర స్థాయిలో ఎన్నో అడ్డంకులను దాటుకుని.. ఎట్టకేలకు నిర్మాణం పూర్తి చేసుకోగా.. త్వరలోనే ప్రారంభానికి సిద్ధం అవుతోంది.అయితే మరీముఖ్యంగా ఐఎస్ సదన్ వద్ద ఉన్న ఒక దేవాలయం.. మరో ప్రార్థన మందిరాలపై ప్రభావం పడేలా ఈ స్టీల్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారని.. స్థానికులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతోపాటు చాలాసార్లు ఆందోళనలు కూడా చేశారు. వీటికి తోడు భూ సేకరణ కూడా ఎన్నో అవాంతరాల మధ్య పూర్తి అయింది.
ఎన్ని అడ్డంకులు వచ్చినా.. అధికారులు వ్యూహాత్మకంగా వాటిని అధిగమిస్తూ వచ్చి.. ఈ స్టీల్ వంతెన పనులను తుది దశకు తీసుకువచ్చారు. ఇటీవలె కొన్ని రోజుల క్రితం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ ఆర్‌వీ కర్ణన్.. ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు.ముందుగా నిర్ణయించుకున్న గడువులోగా ఈ స్టీల్ వంతెన నిర్మాణ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగి.. పనుల్లో వేగం పెంచారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వచ్చే నెల 2వ తేదీన ఈ స్టీల్ వంతెనను
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి.. నగరవాసులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.ఇక ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా ఓవైసీ హాస్పిటల్ వరకు సుమారు 210 మీటర్ల పొడవున అప్ ర్యాంప్‌ను నిర్మించగా.. అక్బర్ బాగ్ వద్ద డౌన్ ర్యాంప్‌ను కూడా నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే నల్గొండ క్రాస్ రోడ్డు నుంచి కంచన్ బాగ్ ఓవైసీ
హాస్పిటల్ వరకు వేగంగా రాకపోకలు సాగనున్నాయి. ప్రస్తుతం చాంద్రాయణగుట్ట, సైదాబాద్, కంచన్ బాగ్ మార్గంలో కొత్త ఫ్లైఓవర్ల నిర్మాణంతో ట్రాఫిక్ భారీగా తగ్గింది.దీనికితోడు ఈ కొత్త ఫ్లైఓవర్ కూడా అందుబాటులోకి వస్తే.. ఆ మార్గంలో వాహానాలు వేగంగా ముందుకు సాగి.. వాహనదారులకు సిగ్నల్ ఫ్రీ ప్రయాణం అందుబాటులోకి రానుందని అధికారులు తెలిపారు. ఈ స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే.. ఓల్ట్ సిటీ, న్యూ సిటీల మధ్యనే కాకుండా.. న్యూ సిటీ నుంచి నగర శివారు ప్రాంతాలకు కూడా రాకపోకలు మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.