బంగారం కొనుగోళ్లపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఇటీవల సికింద్రాబాద్లో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన.. దేశ ప్రజలు ఏడాదిపాటు పెళ్లిళ్ల కోసం బంగారం కొనుగోలు చేయకుండా ఆలోచించాలని సూచించారు. విదేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువుల వినియోగాన్ని తగ్గించడం కూడా దేశభక్తిలో భాగమేనని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల అనంతరం సోషల్ మీడియాలో అనేక రకాల ప్రచారాలు మొదలయ్యాయి. ముఖ్యంగా దేశంలోని దేవాలయాల వద్ద ఉన్న బంగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతోందని, ప్రజల వద్ద ఉన్న బంగారం వివరాలను కేంద్రం సేకరించబోతోందని కొన్ని వర్గాలు విస్తృతంగా ప్రచారం చేశాయి. దీంతో ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.
ఈ ప్రచారం వేగంగా వ్యాపించడంతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించింది. దేవాలయాల ట్రస్టుల వద్ద ఉన్న బంగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఇవన్నీ పూర్తిగా అవాస్తవాలు, నిరాధార ఆరోపణలేనని పేర్కొంది. ఆలయ గోపురాలు, ద్వారాలు లేదా ఇతర నిర్మాణాలపై ఉన్న బంగారం దేశ వ్యూహాత్మక నిల్వలకు సంకేతమంటూ వస్తున్న కథనాలను కూడా మంత్రిత్వ శాఖ పూర్తిగా ఖండించింది. ఇటువంటి తప్పుడు ప్రచారాలు ప్రజల్లో భయాందోళనలు పెంచడమే కాకుండా సమాజంలో అపోహలు సృష్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రపంచ దేశాలతో పోల్చితే భారతదేశంలో బంగారం నిల్వలు అత్యంత ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా భారతీయ కుటుంబాలు, దేవాలయాల వద్ద భారీగా బంగారం నిల్వలుగా ఉందని అంచనాలు ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ వద్ద కలిపి సుమారు 880 టన్నుల బంగారం నిల్వగా ఉంది. అయితే దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవాలయాల్లో అధికారిక గణాంకాలు లేకపోయినా, సుమారు 3,000 నుంచి 4,000 టన్నుల వరకు బంగారం ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిమాణం అనేక అభివృద్ధి చెందిన దేశాల కేంద్ర బ్యాంకుల బంగారం నిల్వల కంటే ఎక్కువగా ఉండటం విశేషంగా మారింది.
విధాన నిర్ణయాలు, ప్రభుత్వ పథకాలు లేదా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమాచారం తెలుసుకునే సమయంలో ప్రజలు అధికారిక వేదికలను మాత్రమే నమ్మాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది. అధికారిక వెబ్సైట్లు, పత్రికా ప్రకటనలు, ధృవీకరించబడిన సమాచార వేదికల ద్వారా వచ్చిన సమాచారాన్నే విశ్వసించాలని కోరింది. అనధికారిక ప్రచారాలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అసత్య సమాచారాన్ని నమ్మవద్దని, వాటిని ఇతరులకు పంపించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
ఇదిలా ఉండగా బంగారం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిషేధం విధించలేదని కూడా స్పష్టత ఇచ్చింది. అలాగే దేవాలయాలు లేదా మతపరమైన సంస్థల ఆస్తులపై ఎలాంటి ప్రతికూల నిర్ణయాలు తీసుకోలేదని తెలిపింది. ధృవీకరణ లేని వార్తలను నమ్మే ముందు వాటి నిజానిజాలు తెలుసుకోవడం ప్రతి బాధ్యతాయుత పౌరుడి కర్తవ్యం అని కేంద్ర ప్రభుత్వం మరోసారి గుర్తు చేసింది.
ALSO READ: పెద్ది సినిమా కోసం రామ్ చరణ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా?