-
ఆరు నెలల్లోగా చెల్లింపులు
-
అధ్యయనానికి ముగ్గురు సభ్యులతో కమిటీ
-
ఏపీ క్యాబినెట్లో సీఎం చంద్రబాబు నిర్ణయం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్. బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు ఏపీ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు. ఆరు నెలల లోగా బాధితులందరికీ చెల్లింపులు చేసేలా చర్యలు చేపట్టనున్నారు. ఈ మేరకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.
తప్పకుండా అగ్రిగోల్డ్ బాధితుల సమస్యకు పరిష్కార మార్గం చూపాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించి వేలం వేసి.. వాటి ద్వారా వచ్చే సొమ్మును బాధితులకు ఇవ్వాలని సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకే ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు అధికారులు భావిస్తున్నారు.
దశాబ్దాల సమస్య..
అగ్రిగోల్డ్ అనేది దశాబ్దాల సమస్య. అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానని 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక పెద్దగా పట్టించుకోలేదు. దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సి ఉంది. కానీ పది లక్షల మంది వరకు 905 కోట్ల రూపాయలను చెల్లించి చేతులు దులుపుకున్నారు.
20వేల రూపాయల కంటే ఎక్కువ కట్టిన వారికి ఎటువంటి న్యాయం జరగలేదు. అటువంటివారు రాష్ట్రంలో ఆరున్నర లక్షల మందికి పైగా ఉన్నారు. వారికి దాదాపు 3 వేల కోట్ల రూపాయలు చెల్లించాలి. అయితే అగ్రిగోల్డ్ మోసానికి గురైన చాలామంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. వందలాదిమంది సహజ మరణాలు పొందారు.
పెద్ద ఎత్తున ఆస్తులు.
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అగ్రిగోల్డ్ సంస్థకు పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి. వీటిలో 90 శాతానికి పైగా ఆస్తులను టిడిపి హయాంలోనే జిప్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిస్సాలో 21, 642 ఎకరాల భూములు, లక్ష 7981 చదరపు గజాల స్థలాలు ఉన్నాయి.
రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం చూస్తే మొత్తం మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని 2012లోనే అంచనా వేశారు. ఇప్పుడు అది మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే వాటిని విక్రయించడం ద్వారా బాధితులకు చెల్లింపులు చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేసింది.