-
కేంద్రమంత్రి పదవి కోసం గట్టి పోటీ
-
ఇద్దరికీ హై కమాండ్ వద్ద పరపతి
-
అధిష్టానం ఎటు మొగ్గు చూపుతుందో?
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: కేంద్ర మంత్రివర్గ విస్తరణ త్వరలో జరగనుంది. కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చి రెండేళ్లు సమీపిస్తోంది. అందుకే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ దిశగా మోడీ అడుగులు వేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. రేపు విదేశీ పర్యటనకు వెళ్ళనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.
విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత క్యాబినెట్ విస్తరణ ఉంటుందన్న టాక్ నడుస్తోంది. చేర్పులు మార్పులతో పాటు యువతకు ఈసారి ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తోంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు ఈసారి ప్రాధాన్యం ఉంటుందని సమాచారం.
ఒకరికి తప్పకుండా..
ఏపీలో బిజెపి ఎంపీ ఒకరికి మంత్రి పదవి ఖాయం అన్న ప్రచారం నడుస్తోంది. ప్రధానంగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పేరు వినిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో పొత్తులో భాగంగా బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు రమేష్. కడప జిల్లాకు చెందిన ఆయన ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలవడం విశేషం. అయితే అప్పట్లోనే సీఎం రమేష్ ను క్యాబినెట్ లోకి తీసుకుంటారన్న ప్రచారం నడిచింది.
కానీ అనూహ్యంగా నరసాపురం ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మ కు ఛాన్స్ దక్కింది. అయితే ఈసారి వెనుకబడిన వర్గాలకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఆ కోటాలో సీఎం రమేష్ పేరును ప్రముఖంగా పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. కేంద్ర పెద్దలతో ఆయనకు ఉన్న సన్నిహిత సంబంధాలు కలిసి వచ్చే అంశం.
చిన్నమ్మకు గట్టి పోటీ..
మరోవైపు రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి పేరు సైతం ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం సీఎం రమేష్ కు ఆమె గట్టి పోటీగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బిజెపి నుంచి కేవలం ముగ్గురే గెలిచారు. అందులో నరసాపురం ఎంపీపీ మంత్రిగా అవకాశం దక్కింది. మిగిలింది ఈ ఇద్దరు మాత్రమే. అయితే పురందేశ్వరి సైతం గతంలో కేంద్ర మంత్రి పదవి చేపట్టడంతో కలిసి వచ్చే అంశం.
మొన్నటి ఎన్నికల్లో ఆమె బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉండేవారు. టిడిపి తో పొత్తు వెనుక అటు సీఎం రమేష్.. ఇటు పురందేశ్వరి కీలకంగా వ్యవహరించారు. కానీ ఇప్పటికే పురందేశ్వరి సామాజిక వర్గానికి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ మంత్రిగా ఉండడంతో.. ఆమెకు చిన్నపాటి ఇబ్బంది. అయితే వెనుకబడిన తరగతులు వారికి మంత్రి పదవి ఇస్తామనుకుంటే మాత్రం.. కచ్చితంగా సీఎం రమేష్ కు అవకాశం దక్కుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.